
సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్టు చేసిన ఇద్దరు యూట్యూబర్లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సైబర్ క్రైమ్ అదనపు సీపీ విశ్వ ప్రసాద్ మీడియాకు వివరించారు. నిప్పు కోడి అనే ఎక్స్ హ్యాండిల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్ ఫిర్యాదు చేశారు.
పల్స్ టీవీకి చెందిన ఓ రిపోర్టర్ గుర్తు తెలియని వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అందులో మాట్లాడిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పల్స్ టీవీ ఉద్దేశ పూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేయించిందని దర్యాప్తులో గుర్తించామని విశ్వ ప్రసాద్ తెలిపారు. పల్స్ టీవీలో వచ్చిన ఈ వీడియోను నిప్పుకోడి అనే ఎక్స్ హ్యండిల్‌లో ట్రోల్ చేశారు.
బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రేవతి ఇంటికి వెళ్లిన 12 మంది పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో రేవతి ఫోన్, ఆమె భర్త, దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆమెకు చెందిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను సైతం పోలీసులు సీజ్ చేశారు. రైతు బంధు రావట్లేదని ఓ రైతు మాట్లాడిన వీడియోను ప్రసారం చేస్తూ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో ఆమెను అరెస్టు చేశారు.
కాగా, దర్యాప్తులో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఓ వ్యక్తిని ఉద్దేశ్యపూర్వకంగా ఇంటర్యూ చేస్తూ రేవంత్ రెడ్డిను అసభ్యకర వ్యాఖ్యలతో దూషించేలా చేశారని పోలీసులు గుర్తించారు. ఆ వీడియో గత నెలలో రికార్డు చేసినా అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు టెలికాస్ట్ చేశారని విశ్వప్రసాద్ తెలిపారు. ఈ వీడియోను నిప్పు కోడి అనే ఎక్స్ హ్యాండిల్లో వైరల్ చేశారని తెలిపారు.
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇన్సెటివ్స్ తీసుకుని మరీ ట్రోల్ చేస్తున్నట్లు తెలిపారు. కైలాష్ ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 67 ఐటీ యాక్ట్, 111బిఎన్‌ఎస్, 61(2), 353(2),352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసి పల్స్ టీవీ ఛానెల్ సీఈవో, జర్నలిస్ట్ రేవతితో పాటు పల్స్ టీవీ ప్రతినిధి బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్‌ను అరెస్ట్ చేశామని అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
మాదాపూర్లోని టీవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి 2 ల్యాప్ టాప్‌లు, 2 హార్డ్ డిస్క్‌లు, లోగో, రూటర్, 7 సీపీయూలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.అరెస్ట్ చేసిన ఇద్దరిని కోర్టులో హజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.
More Stories
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!
17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు!
నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు