మేడిగడ్డ నిర్మాణంలో అన్నీ వైఫల్యాలే

మేడిగడ్డ నిర్మాణంలో అన్నీ వైఫల్యాలే

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో, నిర్వహణలో, నాణ్యతలోనూ వైఫల్యాలు ఉన్నాయని, ఇందుకు బాధ్యులుగా నిర్మాణ సంస్థ, సంబంధిత ఇంజినీర్లను నిర్ధారిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబరులో కుంగిన అనంతరం దీనిపై విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టింది.

పని ముగియకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేయడం, నాణ్యత తనిఖీలు సరిగా లేకపోవడం, ఒప్పందం ప్రకారం ఆపరేషన్​ అండ్ మెయింటెనెన్స్‌ లేకపోవడం, గుత్తేదారు సంస్థ ఎల్‌అండ్‌టీ-పీఈఎస్‌ జాయింట్‌ వెంటర్‌తో పాటు బాధ్యులైన ఇంజీనీర్లపై క్రిమినల్‌ చర్యలను సైతం సిఫార్సు చేసింది.

ఈ ప్రాథమిక నివేదికను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు ప్రభుత్వం అందజేసింది. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా పరిశీలించి తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్‌ ఘోష్‌ అప్పుడు సూచించినట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మూడు బ్యారేజీలపై తుది నివేదికను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయగా, తదుపరి కార్యాచరణకు దాన్ని నీటిపారుదల శాఖకు పంపినట్లు సమాచారం.  

మేడిగడ్డ నిర్మాణం పూర్తయిన తర్వాత, 2019లో ప్రారంభించిన అనంతరం డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లో చేపట్టాల్సిన పనులను చేయకపోవడం, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు లేఖలు రాయడానికే పరిమితమై, ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర అంశాలను తుది నివేదికలో వివరంగా తెలిపి, అందుకు సంబంధిత డాక్యుమెంట్లను కూడా జత చేసినట్లు తెలిసింది.

నీటి పారుదల శాఖతోపాటు కాంట్రాక్టు సంస్థ కూడా ఓఅండ్​ఎం మార్గదర్శకాలు పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది. డ్యాం సేఫ్టీ చట్టం-2021 కూడా అమలు కాలేదని చెప్పింది. కాపర్​డ్యాంను తొలగించలేదని, డీవాటరింగ్​లో అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టర్​కు అయాచిత ప్రయోజనం కలిగించారని, తదితర అనేక అంశాలను విజిలెన్స్​ అధికారులు వివరంగా పేర్కొన్నారు.

వాటికి బాధ్యులు, ఏయే దశల్లో ఇంజినీర్లు వైఫల్యం చెందారు, ఎల్‌అండ్‌టీ ఎక్కడెక్కడ పట్టించుకోలేదు వంటి వివరాలన్నీ నివేదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పని పూర్తికాకుండానే సర్టిఫికెట్‌ ఇచ్చిన ఇద్దరు ఇంజినీర్ల నుంచి విజిలెన్స్‌ ప్రాథమిక నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ వివరణ కోరిందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు.