కన్నడ నటి రన్యారావుకు ఇద్దరు మంత్రుల మద్దతు.. బిజెపి

కన్నడ నటి రన్యారావుకు ఇద్దరు మంత్రుల మద్దతు.. బిజెపి
* బంగారు అక్రమ రవాణా కేసుకు రాజకీయ రంగు

బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసుకు రాజకీయ రంగు కూడా పులుముకుంటుండడంతో దుమారం చెలరేగుతోంది. తనను చిక్కుల్లోంచి బయటపడేయాలంటూ సిద్ధరామయ్య సర్కార్‌లోని ఇద్దరు మంత్రులను ఆమె సంప్రదించినట్లు బీజేపీ ఆరోపించింది.  ఇది తీవ్రమైన ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల మద్దతు లేకుండా రన్యారావు గోల్డ్ స్లిగింగ్ చేయగలిగి ఉండేది కాదని ఆయన స్పష్టం చేశారు.

కాగా, బీజేపీ దాడిని అంతే వేగంగా కాంగ్రెస్ తిప్పికొట్టింది. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బేజీపీ ప్రభుత్వంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డవల్‌మెంట్ బోర్డు రెన్యారావుకు స్టీల్‌ ప్లాంట్ ఏర్పాటు కోసం 2023లో భూమి కేటాయించిందని ఆరోపించింది.  తుమకూరు జిల్లాలో ఉన్న సిరా ఇండస్ట్రియల్ ఏరియాలో రూ.138 కోట్ల విలువైన ప్రాజెక్టుకు 12 ఎకరాల పారిశ్రామిక భూమిని జనవరి 2, 2023న కంపెనీకి కేటాయించినట్లు కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు తెలిపింది.

రన్యారావు పట్టుబడగానే తనను సమస్య నుంచి బయటపడేయాంటూ కొందరు కాంగ్రెస్ మంత్రులను సంప్రదించే ప్రయత్నం చేశారని బీజేపీ నేత, ఎమ్మెల్యే భరత్ షెట్టి మీడియాకు తెలిపారు. ఇద్దరు మంత్రులు ఆమెకు సహకరిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు బయటకు వచ్చిందని, కేసును సీబీఐ చేపట్టడంతో దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.

కాగా, రెన్యారావును చిక్కుల్లోంచి బయటపడేసేందుకు ఒక ప్రముఖ మంత్రి ప్రయత్నిస్తున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు తమకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయోంద్ర ఎడియూరప్పు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొ్న్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి ట్రాక్ రికార్డ్ ఉందని ఎద్దేవా చేశారు. 

గతంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్‌లు చాలానే జరిగి ఉండవచ్చని, పలుకుబడి ఉన్న వ్యక్తుల ప్రమేయం లేకుండా రెన్యారావు రూ.12 కోట్ల బంగారం స్మగ్లింగ్ చేయగలిగి ఉండేది కాదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలే నిజమైతే ఈ సంబంధాలు ఎంత లోతుగా ఉన్నాయన్నదే ప్రధాన ప్రశ్న అవుతుందని చెప్పారు. 

అనుమానాస్పద మంత్రుల వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్యకు ఇంటెలిజెన్స్ సమాచారం అంది ఉండవచ్చని, వారిని కాపాండేకుకు ఎలాంటి ప్రయత్నం చేసినా అది బెడిసికొడుతుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా సీబీఐ రంగంలోకి అడుగుపెట్టినందను నిజం బయటకు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే అది తీవ్రమైన నేరమవుతుందని చెప్పారు. 

పిల్లు పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదని అనుకుంటుందని, కర్ణాటక ప్రభుత్వానికి అలాంటి భ్రమలేవైనా ఉండే దాని నుంచి బయటపడాలని హితవు చెప్పారు. ప్రజలు గమనిస్తున్నారని, నిజం ఏమిటో బయటపడుతుందని పేర్కొన్నారు.

రన్యారావు పట్టుబడగానే ఇద్దరు రాష్ట్ర మంత్రులను సంప్రందించారంటూ విజయేంద్ర చేసిన ఆరోపణలపై రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర స్పందిస్తూ ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, సీబీఐ దర్యాప్తు ముగిసే వరకు ఇలాంటి ఊహాగానాలు వస్తూనే ఉంటాయని చెప్పారు. అయితే, రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌కు రాష్ట్ర మంత్రుల సహకారం ఉందనే ఆరోపణల్లో నిజం లేదని పరమేశ్వర కొట్టిపారేశారు. 

బీజేపీ సహకారంతోనే రన్యారావు స్మగ్లింగ్‌ చేస్తుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 2023లో బీజేపీ హయాంలోనే రన్యారావుకు ప్రభుత్వ భూమి కేటాయించారని, ఈ విషయంపై కూడా సీబీఐ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. రన్యారావుకు బీజేపీ సర్కారు భూమి ఎందుకు కేటాయించినట్టని ఆయన ప్రశ్నించారు.

కాగా, ఆమెకు ఆర్థిక నేరాల న్యాయస్థానం విధించిన మూడు రోజుల డీఆర్‌ఐ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో అధికారులు మళ్లీ కోర్టులో హాజరుపర్చారు. దాంతో కోర్టు ఆమెకు రెండు వారాల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మార్చి 24 వరకు ఆమె జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది.