ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్న సిరియా ప్రభుత్వ దళాలు

ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్న సిరియా ప్రభుత్వ దళాలు
సిరియాలో ప్రభుత్వ అనుకూల దళాలు తమ ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాయి. దేశంలో ఐదు రోజులుగా సాగుతున్న అంతర్యుద్ధంలో వందల సంఖ్యలో సాయుధులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పదవీచ్యుతుడైన తరువాత దేశంలో భారీ ఎత్తున హింస చెలరేగడం ఇదే మొదటిసారి. 
 
ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న దళాలు అసద్‌ మద్దతుదారులపై పలు ప్రాంతాల్లో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా అలావైట్లు నివసించే ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. అసద్‌కు మద్దతుదారులైన అలావైట్లు దేశంలో తిరుగుబాటును లేవదీసే అవకాశమున్నందున వారిని అణచివేస్తున్నామని సిరియన్‌ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

సిరియాలో అలావైట్లు మైనారిటీలు. మొత్తం జనాభాలో 12 శాతం ఉంటారు. లటాకియా, టార్టస్‌లలో వీరు ఎక్కువగా ఉంటారు. సిరియాను దాదాపు ఐదు దశాబ్దాల పాటు పాలించిన అసద్‌ అలావైట్ల వర్గానికి చెందినవారే. అసద్‌ పాలనలో అలావైట్లు అటు సైన్యంలో ఇటు రాజకీయంగా ఒక వెలుగు వెలిగారు. 

అసద్‌ దేశం విడిచి వెళ్లిపోవడంతో ప్రస్తుత పాలకులకు విధేయులైన కొందరు సున్నీ వర్గీయులు అలావైట్లపై ప్రతీకార దాడులకు దిగుతున్నారు. ఎక్కడికక్కడ వారిని ఊచకోత కోస్తున్నారు. దీంతో దశాబ్దాలుగా అసద్‌కు వెన్నుదన్నుగా నిలిచిన అలావైట్లు ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

శుక్ర, శని, ఆదివారాల్లో పశ్చిమ తీరంలో మైనారిటీలైన అలవైట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని, 830మందికి పైగా పౌరులు బలయ్యారని బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ (ఎస్‌ఒహెచ్‌ఆర్‌) తెలిపింది. 231 మంది సిరియా భద్రతా దళాలకు చెందినవారు, 250 మంది అసద్‌ మద్దతుదారులు కూడా చనిపోయారని పేర్కొంది. మృతుల్లో అత్యధికులు సిరియాను గత ఐదు దశాబ్దాలుగా పాలించిన మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ అలవైట్‌ వర్గానికి చెందినవారే,

ప్రస్తుతం అలావైట్లు నివసిస్తున్న ప్రాంతాలకు విద్యుత్తు, నీటి సరఫరాను నిలిపివేశారు. సిరియాలో హింసను అమెరికా, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. సిరియాలో హింస పట్ల దాని సరిహద్దు దేశాలైన టర్కీ, ఇరాక్‌, జోర్డాన్‌ ఆందోళన వ్యక్తంచేశాయి, ఈ హింస ప్రాంతీయ అస్థిరతకు దారితీయవచ్చని హెచ్చరించాయి.

హింస మొదలైన నాటి నుంచి ఇప్పటికి వెయ్యిమందికి పైగా మరణించినట్టు సిరియన్‌ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. అలావైట్ల ఇండ్లను లూటీచేసిన సాయుధులు అనంతరం వాటిని దహనం చేశారు. ప్రభుత్వ దళాలు యువకులను, పురుషులను బహిరంగంగా ఉరి తీస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంది. 

వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయని స్థానికులు చెప్పారు. అసద్‌ మద్దతుదారులకు మరోదారి లేదని, లొంగిపోవాల్సిందేనని సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మ ద్‌ అల్‌ షరా స్పష్టం చేశారు. ప్రభుత్వం తమపై జీహాద్‌ ప్రకటించిందని, ఒక్కో ఇంటిని జల్లెడ పడుతూ అలావైట్లను అంతమొందిస్తున్నారని లటాకియా ప్రాంతానికి చెందిన ఓ పౌరుడు చెప్పారు. 

మరోవైపు ప్రభుత్వ దళాల ప్రతినిధి ఒక వీడియోలో ‘ఇంతకుముందు విముక్తి కోసం యుద్ధం చేశాం, ఇప్పుడు దేశ ప్రక్షాళన కోసం యుద్ధం చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. దీంతో దేశంలో తీవ్ర స్థాయిలో అంతర్యుద్ధం నెలకొంది. అసద్‌ మద్దతుదారులని తెలిస్తే చాలు ఎక్కడబడితే అక్కడే వారిని ఊచకోత కోస్తున్నారు. దీంతో వీధుల్లో ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయని మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ తెలిపింది.