రాయచోటిలో హిందూ భక్తులపై దాడికి రాష్ట్రవ్యాప్త నిరసన 

రాయచోటిలో హిందూ భక్తులపై దాడికి రాష్ట్రవ్యాప్త నిరసన 
అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామి పారువేట ఉత్సవం సందర్భంగా హిందూ భక్తులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిరసనలు తెలిపారు. 
 
అన్ని జిల్లా కేంద్రాలలో మఠాధిపతులు, స్వామీజీలు, వీహెచ్‌పీ నాయకులు, కార్యకర్తలు, హైందవ సోదరసోదరీమణులు కాషాయ జెండాలను చేతబట్టుకొని హిందువులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, హిందువులు జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, వేడుకలు, ఊరేగింపులపై దాడులను మూకుమ్మడిగా ఖండించారు.
 
వీహెచ్‌పీ దక్షిణాంధ్ర ప్రాంత విశేష్ సంపర్క్ ప్రముఖ్ సీతారామయ్య ఆధ్వర్యంలో ప్ర్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయం పారువేట ఉత్సవం పై దాడి చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. దాడికి పాల్పడినవారిని గుర్తించి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిరసన ధర్నా నిర్వహించారు. జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షులు లోకనాథం ఆనందరావు  రాయచోటిలో పోలీసులు వ్యవహరించిన తీరుని ఆయన తప్పుబట్టారు.  హిందువులపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలని వీహెచ్‌పీ ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మిట్ట ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.
 
విజయవాడలోని అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్ వద్ద స్థానిక పరిషత్ నేతల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో పూజ్య స్వామీజీలు, వీహెచ్‌పీ ప్రాంత సంఘటన మంత్రి శ్రీనివాస రెడ్డి, ప్రాంత కోశాధికారులు దుర్గా ప్రసాద్ రాజు, విజయవాడ మహానగర్ అధ్యక్షులు సాన శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా తరలివెళ్లి  మెమోరాండం సమర్పించారు.
 
భక్తుల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా కోనసీమ జిల్లా  కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఏలూరు జిల్లా కేంద్రంలో కూడా హిందూ బంధువులు సంఘటితంగా నిరసన తెలియజేశారు. హిందువుల ఐక్యత వర్థిల్లాలి, హిందూ హిందూ బంధూ బంధూ వంటి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఏలూరు పట్టణంలో ధర్నా నిర్వహించారు.
 
కాకినాడ పట్టణంలోని మహిళాలోకం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొంది. విశాఖ మహానగర్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. రాయచోటిలో సైతం ధర్నా చేపట్టి అనంతరం స్థానిక కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా తరలివెళ్లి హైందవ సోదరులు వినతి పత్రాన్ని సమర్పించారు. రాజమండ్రి, నంద్యాల, అనంతపురం తదితర చోట్ల కూడా సైతం నిరసన ర్యాలీలు జరిగాయి.