
నూతన జాతీయ విద్యా విధానం పైన, స్కూళ్లలో హిందీ భాష బోధన విషయమై కేంద్రం – తమిళనాడు ప్రభుత్వంల మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. ఇదే విషయమై సోమవారం పార్లమెంట్ లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.
హిందీ భాష విషయంలో తమిళనాడు తీరు అనాగరికత అని కేంద్ర మంత్రి విమర్శిస్తే, కేంద్రానిది దురహంకారం అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ముందుగా కేంద్ర మంత్రి ప్రధాన్ లోక్‌సభలో మాట్లాడుతూ “వాళ్లకు (డీఎంకే నేతలకు) నిజాయితీ లేదు. తమిళనాడు విద్యార్థులపట్ల వారికి చిత్తశుద్ధి లేదు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును వాళ్లు నాశనం చేస్తున్నారు” అని విమర్శించారు.
“భాషను అడ్డం పెట్టుకోవడమే వాళ్ల పని అయ్యింది. వాళ్లు రాజకీయాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గం. వారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు.’ అని వ్యాఖ్యానించారు. అంతేగాక డీఎంకేలో అంతర్గత కలహాలు ఉన్నాయని, గత ఎన్నికల సందర్భంగా ఇవి బయటపడ్డాయి” అని ప్రధాన్ ఆరోపించారు. అంతర్గత కలహాలను కప్పిపుచ్చుకునేందుకే హిందీ భాషపై వివాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
పిఎంశ్రీ పథకం ఎంఓయూపై సంతకం చేసేందుకు మొదటి అంగీకరించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు వైఖరి మార్చుకుందని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సహా పలు బీజేపీయేతర రాష్ట్రాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయని ఆయన చెప్పారు. ఈ పథకంపై ఎంఓయూపై సంతకాలు చేయడానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉందని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన డీఎంకీ ఎంకీ లోక్‌సభ నుంచి వాకౌట్ చేసారు. ప్రధాన్ వ్యాఖ్యలను తమిళనాడు సీఎం స్టాలిన్ తిప్పికొడుతూ “మీరు తమిళనాడు ప్రజలను అవమానిస్తున్నారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని అంగీకరిస్తారా?” అని స్టాలిన్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు ప్రధాని మోదీని కూడా టాగ్ చేస్తూ కొనసాగించారు.
“తన జాతీయ విద్యా విధానం ప్రకారం మీ త్రిభాషా సూత్రం అమలు కోసం మేం ముందడుగు వేయలేం. త్రిభాషా సూత్రాన్ని అమలుపర్చాలని మాపై ఎవరూ ఒత్తిడి చేయలేరు” అని స్పష్టం చేశారు. అదేవిధంగా తమిళనాడు స్కూళ్లలో హిందీ బోధనను అమలు చేయకపోతే విద్యాశాఖ నిధులు నిలిపివేస్తామని గత నెలలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు బ్లాక్ మెయిల్ హెచ్చరికలని స్టాలిన్ ఆరోపించారు. ఇది కేంద్ర ప్రభుత్వం దురహంకారమని ఆయన మండిపడ్డారు.
More Stories
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
నాగ్‌పుర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం?