మ‌హాకుంభ్‌లో గంగాజ‌లం స్నానానికి యోగ్య‌మైందే

మ‌హాకుంభ్‌లో గంగాజ‌లం స్నానానికి యోగ్య‌మైందే
ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగ‌మం వ‌ద్ద మ‌హాకుంభ వేళ గంగా న‌ది నీరు స్నానానికి యోగ్యంగా ఉన్న‌ట్లు  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ఇచ్చిన నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వం సోమవారం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. 2023 నుంచి 2025 వ‌ర‌కు గంగా న‌ది నీటి శుభ్ర‌త కోసం రూ.7421 కోట్లు కేటాయించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 
 
స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భ‌దౌరియా, కాంగ్రెస్ ఎంపీ కే సుధాక‌ర్ వేసిన ప్ర‌శ్న‌కు కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపింద‌ర్ యాద‌వ్ స‌మాధానం ఇచ్చారు. సీపీసీబీ రిపోర్టు ప్ర‌కారం పీహెచ్ వాల్యూ, డిజాల్వ్డ్ ఆక్సిజ‌న్‌, బ‌యోకెమిక‌ల్ ఆక్సిజ‌న్ డిమాండ్‌, ఫీక‌ల్ కోలిఫామ్ ప‌రిమితుల‌కు త‌గిన‌ట్లుగానే ఉన్న‌ట్లు తెలిపారు. అన్ని విలువ‌ల అమృత స్నానం చేపేందుకు అనుకూలంగా ఉన్న‌ట్లు చెప్పారు. డీవో, బీఓడీ, ఎఫ్‌సీ ద్వారా నీటి నాణ్య‌త తెలుస్తుంద‌ని పేర్కొన్నారు.

కేంద్ర కాలుష్య నివార‌ణ బోర్డు ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన ఇచ్చిన నివేదిక‌లో ప్ర‌యాగ్‌రాజ్‌లోని నీటి నాణ్య‌త‌పై సందేహాలు వ్య‌క్తం చేసింది. నీటిలో మ‌ల శాతం ఎక్కువ‌గా ఉంద‌ని, దీని వ‌ల్ల మ‌హాకుంభ్ నీరు స్నానానికి అనువైన‌ట్లుగా లేద‌ని జాతీయ గ్రీన్ ట్ర‌బ్యున‌ల్‌కు సీపీసీబీ చెప్పింది. అయితే ప్ర‌యాగ్‌రాజ్ నీటి నాణ్య‌త‌పై మ‌ళ్లీ ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన కొత్త రిపోర్టును స‌మ‌ర్పించారు. 

ఆ రిపోర్టు ప్ర‌కారం త్రివేణి సంగమ నీరు స్నానానికి అనువుగా ఉన్న‌ట్లు సీపీసీబీ పేర్కొన్న‌ది. వేర్వేరు తేదీల్లో, వేర్వేరు ప్రాంతాల నుంచి సేక‌రించిన శ్యాంపిళ్ల ఆధారంగా డేటాను విశ్లేషించిన‌ట్లు తెలిపారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోని శృంగ‌వ‌ర్‌పుర్ ఘాట్ నుంచి దీనాఘాట్ వ‌ర‌కు వారానికి రెండు సార్లు శ్యాంపిళ్ల‌ను సేక‌రించారు. త్రివేణి సంగ‌మ ప్రాంతం నుంచి కూడా నీటిని టెస్టింగ్ కోసం సేక‌రించారు. 

జ‌న‌వ‌రి 12వ తేదీ నుంచి మ్యానిటరింగ్ ప్రారంభ‌మైంది. అమృత స్నానాలు జ‌రిగిన రోజుల్లో నీటిని ప‌రీక్షించారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన 10 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల డేటాను కూడా మానిట‌ర్ చేశారు. సేకరించిన నమూనాలు నది విస్తీర్ణం అంతటా మొత్తం నది నీటి నాణ్యతను పూర్తిగా ప్రతిబింబించలేవని పేర్కొంది.

మ‌హాకుంభ్‌లో వేస్ట్‌వాట‌ర్‌ను ట్రీట్ చేసేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు ప‌ది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసింది. ఇక 21 డ్రైనేజీల ప్ర‌దేశాల వ‌ద్ద వాట‌ర్ ట్రీట్మెంట్ చేసింది. దీని కోసం ఏడు జియో ట్యూబ్‌ల‌ను అమ‌ర్చింది. నీటి శుభ్ర‌త కోసం అడ్వాన్స్ స్థాయి ఆక్సిడేష‌న్ టెక్నిక్‌ల‌ను వాడిన‌ట్లు అధికారులు చెప్పారు.