నీటిశుద్ధి రసాయనంపై భారత్‌ యాంటి డంపింగ్‌ సుంకం

నీటిశుద్ధి రసాయనంపై భారత్‌ యాంటి డంపింగ్‌ సుంకం

చైనా, జపాన్‌ల నుండి దిగుమతి చేసుకునే నీటిశుద్ధి రసాయనంపై భారత్‌ యాంటి -డంపింగ్‌ సుంకాన్ని విధించింది. చైనా, జపాన్‌ల నుండి వచ్చే నీటి శుద్ధి రసాయనంపై భారత్‌ ఐదేళ్ల పాటు టన్నుకు 986 డాలర్ల వరకు యాంటీ డంపింగ్‌ సుంకాన్ని విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

రద్దు చేయకపోతే, భర్తీ చేయకపోతే, సవరించకపోతే విధించిన యాంటీ డంపింగ్‌ సుంకం ఐదు సంవత్సరాలు కొనసాగుతుందని నోటిఫికేషన్‌ పేర్కొంది. వాణిజ్య శాఖ దర్యాప్తు విభాగం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమెడీస్‌ (డిజిటిఆర్‌) సిఫార్సుల మేరకు ‘ట్రైక్లోరో ఐసోసైన్యూరిక్‌ యాసిడ్‌’పై సుంకం విధించాలని నిర్ణయించినట్లు తెలిపింది. 

చైనా, జపాన్‌ల నుండి భారత్‌లోకి దిగుమతులను కుమ్మరించడంతో దేశీయ పరిశ్రమ భౌతికంగా నష్టపోయిందని డిజిటిఆర్‌ తన సిఫార్సుల్లో పేర్కొంది. డిజిటిఆర్‌ దర్యాప్తు చేపట్టి, సుంకం విధించాలని సిఫార్సు చేసిన అనంతరం వాణిజ్య శాఖ మూడు నెలల్లోపు సుంకం విధింపుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ రెండు దేశాలు భారతదేశానికి కీలక భాగస్వాములుగా ఉన్నాయి.

దిగుమతుల కారణంగా తక్కువ ధరలతో  దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయో లేదో తనిఖీ చేయడానికి పలు  దేశాలు యాంటీ డంపింగ్‌ దర్యాప్తును చేపడతాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) నిబంధనలకు అనుగుణంగా సుంకాలను విధిస్తాయి. దేశీయ పరిశ్రమకు సమాన అవకాశాలను కల్పించడానికి, చట్టబద్ధమైన వాణిజ్యాన్ని నిర్థారించడానికి యాంటీ  డంపింగ్‌  చర్యలు చేపడతాయి.