మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై చైతన్య, మరికొందరి ఇళ్లలో తనిఖీలు సాగుతున్నాయి. చైతన్యకు సన్నిహితుడిగా పేరున్న లక్ష్మీ నారాయణ్ బన్సాల్ అలియాస్ పప్పు బన్సాల్, మరికొందరి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
భిలాయిలోని నివాసంలో తండ్రి భూపేష్‌తో పాటే చైతన్య కూడా ఉంటున్నారు. మద్యం అక్రమాల ద్వారా వచ్చిన ఆదాయం చైతన్య బఘేల్‌కు చేరిందని ఆరోపణలు ఉన్నాయి. ఈడీ తనిఖీల నేపథ్యంలో భగేల్ కార్యాలయం స్పందిస్తూ “ఏడు సంవత్సరాలు నడిచిన తప్పుడు కేసును కోర్టు కొట్టివేసింది. కానీ ఇప్పుడు ఈడీ అతిథులు వచ్చి భగేల్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు” అని మండిపడింది. భూపేశ్ బఘేల్ కుమారుడి నివాసాలపై ఈడీ దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమైన రోజునే, కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు చేయడం ఒక కుట్రలో భాగమని పేర్కొంది. పార్లమెంట్‌లో విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలను హైడ్‌లైన్స్‌లో రాకుండా చేసేందుకు, వాటిని మేనేజ్ చేసేందుకు మోదీ సర్కార్ చేసిన కుట్ర ఇదని అని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగాధిపతి పవన్ ఖేరా ఆరోపించారు.
మొత్తంగా ఛత్తీస్‌గడ్‌లో 14 నుంచి 15 ప్రాంతాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయి. మద్యం కుంభకోణం ఛత్తీస్‌గఢ్ ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించిందని లిక్కర్ సిండికేట్ రూ. 2,100 కోట్లు కొల్లగొట్టిందని ఈడీ గతంలో పేర్కొంది. ఈ కేసులో మాజీ మంత్రి కవాసి లఖ్మా, రాయపూర్ మేయర్ సోదరుడు అన్వర్ ధెబార్, మాజీ ఐఏఎస్ అనిల్ టుటేజా తదితరులను జనవరిలో అరెస్టు చేసింది. 2019, 2022 మధ్య ఛత్తీస్‌గఢ్ సీఎంగా భూపేష్ బఘేల్ ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి
ప్రపంచ వృద్ధిని దెబ్బ తీస్తున్న ట్రంప్ విధానాలు