
“లలిత్ మోదీ వనౌటు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని పౌరసత్వ కమిషన్‌ను నేను ఆదేశించాను” అని ప్రధాని నపట్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.
“దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్‌పోల్ స్క్రీనింగ్‌లోనూ, అలాగే అన్ని ప్రామాణిక నేపథ్య తనిఖీలలోనూ లలిత్ మోదీపై ఎటువంటి నేరారోపణలు లేవని తేలింది. అయితే గత 24 గంటల్లో ఆయనపై హెచ్చరిక నోటీసు జారీ చేయాలని భారత అధికారులు ఇంటర్‌పోల్‌కు 2 సార్లు అభ్యర్థన చేసినట్లు మాకు సమాచారం అందింది. కానీ సరైన ఆధారాలు లేనందువల్ల భారత అధికారుల అభ్యర్థనలను ఇంటర్‌పోల్ తిరస్కరించింది” అని ప్రధాని తెలిపారు.
“ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వనాటు పౌరసత్వం పొందడానికి చట్టబద్దమైన కారణాలు ఉండాలి. స్వదేశంలో (భారత్) దర్యాప్తును తప్పించుకోవడానికి లలిత్ మోదీ వనాటు పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తోంది. అతడు చూపిన కారణం చట్టబద్దంగా లేకపోవడం వల్ల లలిత్ పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం” అని ఆ దేశ ప్రధాని వివరించారు.
లలిత్ మోదీ పౌరసత్వంను రద్దుకు సంబంధించిన సమాచారాన్ని వనౌటు దినపత్రిక వనౌటు డైలీ వెల్లడించింది. భారత్ ఒత్తిడి వల్లే లలిత్ మోదీ పౌరసత్వాన్ని ఆ దేశం రద్దు చేసినట్లు సమాచారం. లలిత్ మోదీ పాస్‌పోర్ట్ రద్దు చేయడంలో న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్ కీలక పాత్ర పోషించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
లలిత్ మోదీ వనాటు పౌరసత్వం తీసుకున్న నేపథ్యంలో తన భారతీయ పాస్‌పోర్టును అప్పగించేందుకు లండన్‌లోని రాయబార కార్యాలయంలో ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందిస్తూ, నిబంధనల ప్రకారం అధికారులు దానిని పరిశీలిస్తున్నారని పేర్కొంది. అంతేకాదు లలిత్ మోదీపై ఉన్న కేసును చట్ట ప్రకారం కొనసాగిస్తామని తెలిపింది.
కాగా, ఐపీఎల్‌కు బాస్‌గా ఉన్న సమయంలో లలిత్ మోదీ కోట్లాది రూపాయలు దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన భారత్ నుంచి పారిపోయి లండన్‌కు మకాం మార్చారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి
ప్రపంచ వృద్ధిని దెబ్బ తీస్తున్న ట్రంప్ విధానాలు