ఒక వంక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) స్కామ్ కేసులో పశ్చిమ బెంగాల్ లోని తొమ్మిది ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోదాలు నిర్వహిస్తోంది. కోల్ కతా, బర్ధమాన్, హబ్రాలలో ఉన్న సరఫరా దారులు, ఎగుమతి దారులకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. సంక్షేమ పథకాల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ గోధుమల భారీ ఎత్తున దుర్వినియోగం జరుగుతోందని కస్టమ్స్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో 2020లోబసిర్హాట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్యలు చేపట్టింది.
సాగర్ ఎంటర్ ప్రైజస్, ఆ సంస్థ యజమాని సుసాంతో సాహా, మరో కంపెనీ యజమాని పార్థ సాహా, మా అన్నపూర్ణ రైస్ కన్సర్ట్స్ : సైనాక్స్ అన్నపూర్ణ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్: కేజి ఫుడ్ ట్రేడింగ్ యజమాని దౌలత్ రామ్ గుప్తా, కంచన్ సోమ్ అనే వ్యక్తులతో సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయని ఇడి అధికారి ఒకరు తెలిపారు. సంక్షేమ పథకాల కోసం ఉద్దేశించిన పిడిఎస్ గోధుమలను పెద్ద ఎత్తున దారి మళ్లించారని ఈ కేసులో ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.
సరఫరాదారులు, లైసెన్స్ పొందిన పంపిణీదారులు, డీలర్లు, మధ్యవర్తులతో కుమ్మక్కై, అనధికారిక మార్గాల్లో తక్కువ ధరలకు గోధుమలను సేకరించారని, సరఫరా చేయకుండా దారి మళ్లించి నిల్వ చేశారని ఇడి అధికారులు తెలిపారు. వాటిని దాచిపెట్టేందుకు నిందితులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ), రాష్ట్ర ప్రభుత్వ ముద్రణ ఉన్న సంచులను తొలగించి, తిరగేసి నింపారని అన్నారు. దీంతో గోధుమలను బహిరంగ మార్కెట్లో తిరిగి విక్రయించేందుకు, ఎగుమతి కోసం చట్టబద్ధమైన సరుకుగా మార్చి మోసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బసిర్‌హాట్‌లోని ఘోజడంగా సరిహద్దు సమీపంలో బియ్యం, గోధుమలతో నిండిన 175 వాహనాలను సరిహద్దు భద్రతా దళం సిబ్బంది అడ్డగించిన ఘటనతో, శనివారం నాటి సోదాలకు కూడా సంబంధం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.సోదాలకు గురైన ముగ్గురు వ్యక్తులు, రాష్ట్ర మాజీ ఆహార, సరఫరాల శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు జ్యోతిప్రియ మల్లిక్‌కు సన్నిహితులుగా ప్రసిద్ధి చెందారు.
ఇదే కేసులో మల్లిక్‌ను గతంలో ఈడీ అరెస్టు చేయగా, ఆయన చాలా కాలం కస్టడీలో ఉన్నారు.ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఏప్రిల్ 29న పోలింగ్ జరగనున్న హబ్రా నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ దర్యాప్తుకు సంబంధించి, బసిర్‌హాట్ మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటిగా రాజకీయాల్లోకి వచ్చిన నుస్రత్ జహాన్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది.
More Stories
పేటియం పేమెంట్ బ్యాంక్ రద్దు
వేసవి రద్దీకి 18వేల సమ్మర్ స్పెషల్ రైళ్లు
రాబోయే ఐదేళ్లలో 51 శాతం పెరగనున్న బిలియనీర్లు