పేటియం పేమెంట్‌ బ్యాంక్‌ రద్దు

పేటియం పేమెంట్‌ బ్యాంక్‌ రద్దు

పేటియం పేమెంట్‌ బ్యాంక్‌ తీవ్ర నిబంధనల వరుస ఉల్లంఘనలకు ఎట్టకేలకు కాలం చెల్లింది. ఆ సంస్థ లైసెన్స్‌ను రద్దు చేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా బ్యాంక్‌ కార్యకలాపాలు సాగాయని శుక్రవారం ఆర్‌బిఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.   పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పిపిబిఎల్‌) తాము జారీ చేసిన నిబంధనలను పాటించడంలో విఫలమైందని ఆర్‌బిఐ తెలిపింది.

బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం ప్రకారం పిపిబిఎల్‌ ఇకపై బ్యాంకింగ్‌ కార్యకలాపాలను నిర్వహించలేదని పేర్కొంది. బ్యాంక్‌ వ్యవహారాలు, నిర్వహణ డిపాజిటర్ల లేదా ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా లేవని స్పష్టం చేసిందినిబంధనలను పాటించడంలో బ్యాంక్‌ విఫలమైందని ఆర్‌బిఐ వెల్లడించింది. ఈ పేమెంట్‌ బ్యాంక్‌లో పేటియం ఫౌండర్‌ శేఖర్‌ శర్మకు 51 శాతం వాటా, వన్‌ 97 కమ్యూనికేషన్స్‌, ఇతర సంస్థలకు 49 శాతం మేర వాటా ఉంది. ఆర్‌బిఐ నిర్ణయం శేఖర్‌ శర్మకు ఊహించని దెబ్బ అని పరిశ్రమ వర్గాలు చర్చింకుంటున్నాయి.

తప్పుడు పాన్‌ కార్డులు, ఒకే కార్డుపై వందలాది ఖాతాల నిర్వహణ తదితర పలు నిబంధనలను ఉల్లంఘించడంతో ఇంతక్రితం 2022 మార్చి 11 నుండి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్‌బిఐ ఆంక్షలు విధించింది. ఆ తర్వాత కస్టమర్ల ఖాతాలు, వాలెట్లలో డిపాజిట్లు, క్రెడిట్లు, టాప్‌అప్‌లపై కూడా ఆంక్షలు పెట్టిందికస్టమర్ల డ్యూ డిలిజెన్స్‌ నిధుల వినియోగం, సాంకేతిక మౌలిక సదుపాయాలతో సహా ఇతర నిబంధనలను పాటించనందున కొత్త డిపాజిట్లను స్వీకరించడం నిలిపివేయాలని జనవరి 2024లో ఆదేశించింది.

బ్యాంక్‌ను మూసివేయడానికి హైకోర్టులో దరఖాస్తు చేయనున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది. ప్రస్తుతం బ్యాంక్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ అవి కేవలం పాత డిపాజిట్ల ఉపసంహరణ ప్రాసెస్‌ చేయడానికి, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ద్వారా లోన్‌ రెఫరల్స్‌ను సులభతరం చేయడానికి మాత్రమే పరిమితమయ్యాయి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2026 ఏప్రిల్‌ 24 నాటి ఉత్తర్వు ద్వారా బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్‌ 22(4) ప్రకారం పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు జారీ చేసిన బ్యాంకింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది. దీనివల్ల బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్‌ 5(బి) ప్రకారం బ్యాంకింగ్‌వ్యాపారాన్ని లేదా సెక్షన్‌ 6 కింద పేర్కొన్న మరేదైనా అదనపు వ్యాపారాన్ని నిర్వహించకుండా తక్షణమే నిషేధించబడింది. బ్యాంక్‌ను మూసివేసే ప్రక్రియ కోసం ఆర్‌బిఐ హైకోర్టులో దరఖాస్తు చేస్తుంది.’ అని సెంట్రల్‌ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.