అమరావతి రుణాలు ఎఫ్ఆర్‌బీఎం పరిమితిలోకి రావు

అమరావతి రుణాలు ఎఫ్ఆర్‌బీఎం పరిమితిలోకి రావు
రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఆర్‌బీఎం పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు పార్లమెంట్‌కు ఆయన తెలిపారు.

సోమవారం లోక‌సభలో వైసీపీ సభ్యుడు డా. గురుమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ  రాజధాని అమరావతి ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం ఇప్పటి వరకు ప్రత్యేక సాయం  గ్రాంట్స్ కింద రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం, అమరావతి సమ్మిళిత,సుస్ధిర రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.6,700 కోట్ల చొప్పున రుణ ఆమోదం కోసం సాయం చేశామని ఆయన సోదాహరణగా గణాంకాలతో సహా వివరించారు.

ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయని  పంజక్ చౌదరి లోక్ సభ సాక్షిగా ప్రకటించారు. అయితే ఈ రుణాలకు సంబందించిన పంపిణీ ఇంకా జరగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10 శాతానికి మించకుండా, గరిష్టంగా రూ.1,500 కోట్లు, ప్రత్యేక సాయంగా గ్రాంట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు ”కౌంటర్‌ పార్ట్‌ ఫండింగ్” సమకూర్చాలని కూడా నిర్ణయించామని ఆయన తెలిపారు.

రుణం మంజూరు చేసేటప్పుడు రూపొందించిన మార్గదర్శకాలు, షరతులను అనుసరించి నిధుల వినియోగ పర్యవేక్షణ జరుగుతుందని తన లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి  పేర్కొన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

 
అందులోభాగంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుంటుంది. అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి సైతం రుణాలు పొందేందుకు చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించిన అన్ని ఒప్పందాలు ఇప్పటికే ఖరారయ్యాయి.

మరోవైపు ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే పునరుద్ఘాటించారు. అదీకాక, గత వైసీపీ పాలనలో రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ప్రకటన చేసి.. రాష్ట్రాభివృద్ధిని అధ:పాతాళానికి నెట్టేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు సారథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.