నామినేషన్ లు దాఖలు చేసిన కూటమి అభ్యర్ధులు

నామినేషన్ లు దాఖలు చేసిన కూటమి అభ్యర్ధులు
 
* బిజెపి అభ్యర్థిగా సోము వీర్రాజు నామినేషన్
 
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ముగ్గురు అభ్యర్థుల‌తో పాటు బీజేపీ అభ్య‌ర్ధి సోమవారం నామినేష‌న్ లు దాఖ‌లు చేశారు. నేటితో నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగియ‌నుండ‌టంతో అంద‌రూ నామినేష‌న్ లు వేశారు. టీడీపీ త‌రుపున కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద ర‌విచంద్ర‌, బీజేపీ త‌రుపున సోము వీర్రాజు లు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్ధులుగా త‌మ నామినేష‌న్ ప‌త్రాల‌ను రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేశారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీల పాల్గొన్నారు.  కాగా, ఏపీలో మొత్తం ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోటీ జ‌రుగుతుండ‌టంతో కూట‌మి పార్టీలు సీట్లు స‌ర్దుబాటు చేసుకున్నాయి. టీడీపీ మూడు స్థానాల‌లో పోటీ చేస్తుండ‌గా జ‌న‌సేన‌, బీజేపీకి ఒక్కో స్థానం కేటాయించారు.
తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీలుగా కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అభ్యర్థులకు మద్దతుగా నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, విష్ణుకుమార్ రాజు, రఘురామకృష్ణంరాజు, పితాని సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పల్లా శ్రీనివాస్, టీడీ జనార్దన్, కురుగొండ్ల రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి తదితరులు వచ్చారు. 

అలాగే అసెంబ్లీ కమిటీ హాల్లో బీజేపీ అభ్యర్థి సోమి వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు కందుల దుర్గేష్, సత్య కుమార్ యాదవ్, పల్లా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మంగళవారం నామినేషన్లను పరిశీలించనున్నారు.  ఈ నెల 13న నామినేషన్‌ల ఉపసంహరణకు చివరి తేదీ. అయితే విపక్షం నుంచి పోటీ లేనందున ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇప్ప‌టికే జ‌న‌సే అభ్య‌ర్ధి నాగబాబు నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

కూటమి పొత్తులో భాగంగా తమకు లభించిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా బీజేపీ అధినాయకత్వం సోము వీర్రాజును ప్రకటించింది. ఈ నేపథ్యంలో, పార్టీ అధిష్ఠానానికి సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. కూటమి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు.

 “ఏపీ శాసనమండలి ఎన్నికల కోసం నామినేషన్ వేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు డి పురందేశ్వరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం, పార్టీ ఎదుగుదల కోసం అవిశ్రాంతంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉంటాను. పార్టీ కేంద్ర నాయకత్వం మార్గదర్శనంలో ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషిని కొనసాగిస్తాం” అని సోము వీర్రాజు వెల్లడించారు.

మరోవంక, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు దాఖలు చేశారు. పొత్తులో భాగంగా సీపీఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. సీపీఐ తరఫున నెల్లికంటి సత్యాన్ని బరిలోకి దిగారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు హాజరయ్యారు. అలాగే బీఆర్‌ఎస్ తన అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ పేరును ఖరారు చేయడంతో ఆయన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు పాల్గొన్నారు.