
అంతరిక్ష పరిశోధనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారం, భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేయడం ఈ రంగంలో వేగవంతమైన అభివృద్ధికి నిదర్శనం. ప్రధానంగా గగన్ యాన్ మిషన్, నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ అండ్ అప్లికేషన్స్ (ఎన్ఎస్ఐఎల్), ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం ద్వారా భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఒక కీలక అంతరిక్ష శక్తిగా మారుతుంది.
2013-14 నాటికి భారత అంతరిక్ష బడ్జెట్ 5,615 కోట్లు కాగా, 2024-25 నాటికి రూ 13,416 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ఇండియా 433 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. వాటిలో 396 ఉపగ్రహాలు 2014 తర్వాత ప్రధాని మోదీ నాయకత్వంలోనే ప్రయోగించబడ్డాయి. ఈ ప్రయోగాలతో 192 మిలియన్ డాలర్లు, 272 మిలియన్ యూరోలు ఆదాయాన్ని ఇండియా ఆర్జించింది.
భారత దేశపు తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్ యాన్ 2025లో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి, ఈ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసారు. వీరిలో ఒకరు ఇప్పటికే అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్) సందర్శించేందుకు ఎంపికయ్యారు. 2035 నాటికి స్వంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇది పూర్తయిన తర్వాత, భారతదేశం చైనా, అమెరికా, రష్యా వంటి దేశాలతో సమాన స్థాయిలో అంతరిక్ష పరిశోధనకు నడుం బిగిస్తుంది. 2040 నాటికి తన మొదటి వ్యోమగామిని చంద్రునిపై పంపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇదిభారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో టాప్ 4 స్పేస్ పవర్‌లలో ఒకటిగా నిలబెట్టేందుకు సహాయపడుతుంది.
భారత అంతరిక్ష పరిశోధనలో ప్రైవేట్ రంగ సంస్థలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఎన్ఎస్ఐఎల్, ఐఎన్- స్పెక్ ఈ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి వ్యవసాయ, టెలికమ్యూనికేషన్, డిఫెన్స్, క్లైమేట్ స్టడీస్ వంటి విభాగాల్లో స్పేస్ టెక్నాలజీని విస్తరిస్తున్నాయి. భారత ఉపగ్రహ వ్యవస్థను పొరుగు దేశాలతో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.
వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ, సమాచార వ్యవస్థల మెరుగుదల కోసం భారత ఉపగ్రహాలు కీలకంగా మారాయి. భారతదేశం తన స్వంత ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని 2035 నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు భారత ఉపగ్రహ సర్వీసులపై ఆధారపడి ఉన్నాయి.
భారతదేశం రాకెట్ టెక్నాలజీ, సింథటిక్ అపర్చర్ రాడార్ (ఎస్ఎఆర్), సూపర్ కాంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ వంటి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేస్తోంది. 2030 నాటికి స్పేస్ టూరిజం రంగంలో కూడా భారతదేశం ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధన దూసుకుపోతుంది!
44 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్, ఐఎన్- స్పెక్ -సంస్థలు కలిసి కొత్త మైలురాళ్లను అందుకుంటున్నాయి. గగన్ యాన్, చంద్ర మిషన్, భారత అంతరిక్ష స్టేషన్, అంతర్జాతీయ ఉపగ్రహ సేవలు వంటి ప్రాజెక్టుల ద్వారా భారతదేశం ప్రపంచ అంతరిక్ష రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది.
మరోవంక, ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం కార్యకలాపాలు శనివారం ప్రారంభమయ్యాయి. దీనిని స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ (ఎస్‌సీఓటీ) అంటారు. ఈ నిఘా ఉపగ్రహం భూ కక్ష్యలో తిరుగుతూ భూమిపై గల 5 సెంటీమీటర్ల వస్తువును సైతం చిత్రీకరించగలదు. దీనిని భారత స్టార్టప్ ‘దిగంతర’ జనవరి 14న ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ట్రాన్స్‌పోర్టర్-12 రాకెట్ ద్వారా ప్రయోగించింది.
ఈ ఉపగ్రహం తన పనిలో భాగంగా మొదట దక్షిణ అమెరికాలోని బ్యూనస్ ఎయిర్స్ నగరాన్ని చిత్రీకరించింది. తమ శాటిలైట్ పంపిన మొదటి చిత్రం కేవలం సాంకేతికపరమైన మైలురాయి మాత్రమే కాదని, అంతకన్నా ఎక్కువని దిగంతర సీఈవో అనిరుద్ధ్ శర్మ తెలిపారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత