సుదీర్ఘ దేశ క్రికెట్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా మరో అపురూప సందర్భంతో కోట్లాది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. రెండేండ్ల క్రితం సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో అనూహ్య పరాజయంతో వన్డే ప్రపంచకప్ టైటిల్ చేజార్చుకున్న భారత్..మినీ ప్రపంచకప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీలో తీన్మార్‌తో దుమ్మురేపింది.
సరిగ్గా 12 ఏండ్ల క్రితం మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్‌ఇండియా పుష్కరకాలం తర్వాత ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. నిరుడు టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడిన రోహిత్ సేన తాజాగా చాంపియన్స్ ట్రోఫీనీ కైవసం చేసుకుంది.
టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరిన టీమ్‌ఇండియా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన స్పిన్ థ్రిల్లర్‌లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా నిలిచింది. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించిన మ్యాచ్‌లో భారత్‌నే విజయం వరించింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల ఛేదనలో రోహిత్ (83 బంతుల్లో 76, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగారు.
డారిల్ మిచెల్ (101 బంతుల్లో 63, 3 ఫోర్లు), మైఖేల్ బ్రాస్‌వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు పోరాడగలిగే స్కోరును సాధించింది. రోహిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రచిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు దక్కాయి
టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ ఇన్నింగ్స్‌లో తొలి 7 ఓవర్లు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత 43 ఓవర్లు మరో ఎత్తు. వరుణ్, కుల్‌దీప్, జడేజా, అక్షర్ మాయాజాలంలో చిక్కుకుని కివీస్ రెక్కతెగిన కివీ పక్షిలా విలవిల్లాడింది. పది కాదు.. ఇరవై కాదు.. ఈ నలుగురూ కలిసి నిరాటంకంగా 35 ఓవర్లు (మొత్తం 38) వేసి న్యూజిలాండ్‌ను కోలుకోనీయలేదు.
ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 37, 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత పేస్ ద్వయం షమీ, హార్దిక్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పేసర్లతో లాభం లేదని గ్రహించిన రోహిత్.. ఆరో ఓవర్లోనే వరుణ్‌ను బరిలోకి దింపాడు. అతడు తన రెండో ఓవర్లోనే ఓపెనర్ విల్ యంగ్ (15)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని కివీస్ వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు.
252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్ భాగస్వామ్యానికి 105 పరుగులు జతచేసారు. 105 పరుగుల వద్ద మిచెల్ శాంత్నర్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ బ్రేస్‌వాల్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ కావడంతో క్రీజ్‌ను వదిలేశాడు. తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ జట్టు స్కోర్ చకచకా పెంచడానికి ప్రయత్నించారు. ఈ తరుణంలో 122 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్ కావడంతో టీమ్ ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది.
శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. కానీ 48 పరుగులతో శ్రేయాస్ అయ్యర్, 29 పరుగులతో అక్షర్ పటేల్ వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో హార్దిక్ పాండ్యా వచ్చి మెరుపులు మెరిపించి 18 బంతుల్లో 18 పరుగులు చేసి జేమ్సియన్ బౌలింగ్‌లో ఆయనకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
దీంతో వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడుతూ వీలు చిక్కినప్పుడు షాట్లు కొడుతూ జట్టు విజయ తీరాలకు చేర్చారు. 49వ ఓవర్ చివరి బంతిని ఫోర్‌గా మలిచి కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాను గెలిపించాడు. ఆరు వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా 254 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో మిచెల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంత్నర్ రెండేసి వికెట్లు, కేల్ జమియ్సన్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు.
More Stories
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?.. చర్చలంటూ గగ్గోలు!
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!