అమెరికా సైన్యంలో దారి మళ్లిన ఆహార నిధులు

అమెరికా సైన్యంలో దారి మళ్లిన ఆహార నిధులు

అమెరికాలో ఆర్మీ నిధులు నిర్దేశిత లక్ష్యాల కోసం కాకుండా వేరే ప్రాజెక్టులకు తరలించడంపై దుమారం చెలరేగుతోంది. సైనికుల ఆహారం కోసం వారి వేతనాల నుంచి కొంత మొత్తాన్ని అమెరికా ప్రభుత్వం సేకరిస్తుంది. ఆ మొత్తాన్ని ఒక నిధిగా ఉంచి వారి భోజనం కోసం ఖర్చు చేస్తారు. కానీ ఇలా సేకరించిన నిధుల్లో అత్యధిక భాగం ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నట్లుగా మిలిటరీ డాట్‌కామ్‌ అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.

సైనికుల ఆహార నిధుల్లో సగం కంటే తక్కువ మాత్రమే సైనికుల భోజనానికి వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఆర్మీ ఆహారం కోసం మొత్తం 225 మిలియన్‌ డాలర్లు సైనికుల వేతనాల నుంచి సేకరించగా, వాటిలో కేవలం 74 మిలియన్‌ డాలర్లు మాత్రమే వెచ్చించినట్లు నివేదిక వెల్లడించింది. సాధారణంగా బ్యారక్‌లలో ఉంటున్న ప్రతి సైనికుడి వేతనం నుంచి నుంచి ప్రతి నెలా 460 డాలర్లు కట్‌ చేస్తారని ఓ అధికారి పేర్కొన్నారు.

సిబ్బందికి ఆహారం అందించడానికి ఈ నియమం పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 2024లో దేశంలోని పలు స్థావరాల్లోని సైనికుల నుంచి 225 మిలియన్‌ డాలర్లు తీసుకున్నారని, కానీ వాటిలో దాదాపు 151 మిలియన్‌ డాలర్లను ఇతర ప్రాజెక్టులకు మళ్లించారని మిలిటరీ డాట్‌ కామ్‌ వెల్లడించింది. అయితే, వారి నుంచి సేకరించిన వాస్తవ నగదు మరింత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. 

మరో వైపు జార్జియాలోని ఫోర్ట్‌ స్టీవర్ట్‌లో సైనికుల నుంచి 17 మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తే, అందులో కేవలం 2.1 మిలియన్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేయగా, దాదాపు 87 శాతం ఇతర ప్రాజెక్టులకు మళ్లించినట్లు తెలిపింది. సైనికుల ఆహారం నుంచి నిధులను దొంగలిస్తూ సైనిక సంసిద్ధతను సాధించడం సాధ్యం కాదని ప్రతినిధుల సభ సభ్యుడు జుల్‌ టోకుడ వ్యాఖ్యానించారు.

సైనికుల నుంచి దాదాపు 151 మిలియన్‌ డాలర్లు సేకరించారని, కానీ, అవసరాలకు తగినట్లు మాత్రం ఆహారం అందించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల సైనికులు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారన్నారు. వారికి నాణ్యమైన ఆహారం అందించట్లేదని పలువురు అధికారులు ఫిర్యాదు చేశారు. సరిగా ఉడకని మాంసం, నాసిరకం కూరగాయలతో భోజనం పెడుతున్నట్లు వెల్లడించారు.