మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్

మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్
 
మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు.  ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఆ దేశ ఆర్థిక నేరాల కమిషన్‌ ప్రవింద్‌తో పాటు ఆయన సతీమణి కోబితాను గంటలపాటు విచారించింది. అనంతరం ప్రవింద్‌ను అరెస్టు చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. సెంట్రల్‌ మారిషస్‌లోని మెకాలో ఉన్న నిర్బంధ కేంద్రంలో ఆయన్ను ఉంచినట్లు తెలిపింది. ప్రవింద్‌ జగన్నాథ్‌పై ఇటీవల మనీ లాండరింగ్‌ ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి ప్రవింద్‌ నివాసంలో ఆర్థిక నేరాల కమిషన్‌ శనివారం సాయంత్రం సోదాలు చేపట్టింది.  అధికారులు శనివారం అతని భార్య కోబితా జగన్నాథ్‌ తో పాటు 63 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  వారిని ప్రశ్నించిన తర్వాత ఆదివారం మాజీ ప్రధాని నివాసంలో సోధాలు నిర్వహించి జగ్‌నాథ్‌ల పేర్లతో కూడిన పత్రాలు, అలాగే లగ్జరీ వాచీలు, వివిధ కరెన్సీల స్టాక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

మారిషస్‌ ప్రధానిగా 2017 నుంచి 2024 వరకు కొనసాగిన ప్రవింద్‌ జగన్నాథ్‌ గతేడాది చివర్‌లో రాజీనామా చేశారు. ఆ వెంటనే నవీన్ రామ్ గులాం నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని ఒప్పందాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, వాటిపై ఆడిట్‌ నిర్వహిస్తామని నవీన్‌ అప్పట్లో ప్రకటించారు. వీటికి సంబంధించిన విచారణ చేపట్టిన ప్రస్తుత ప్రభుత్వం మనీ లాండరింగ్‌ అభియోగాలపై ప్రవింద్‌ను అరెస్టు చేసింది.