ఉక్రెయిన్‌- రష్యా యుద్ధంపై సౌదీ అరేబియాలో నేడే శాంతి చర్చలు

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధంపై సౌదీ అరేబియాలో నేడే శాంతి చర్చలు

దాదాపు మూడేళ్లుగా ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేస్తున్న యత్నాలు జోరందుకొన్నాయి. సౌదీ అరేబియాలో శాంతి చర్చలకు ప్రాతిపదిక ఏర్పాటు చేసేందుకు అమెరికా, రష్యా అధికారులు మంగళవారం సమావేశం కానున్నారు. త్వరలో డొనాల్డ్ ట్రంప్, పుతిన్ సమావేశం జరిపేందుకు ఈ సమావేశం భూమిక ఏర్పాటు చేస్తుంది.

తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి అధికారిక పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్నారు. భారీ మానవీయ సహాయ కార్యక్రమం నిమిత్తం తాను ఇక్కడికి వచ్చినట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.  అయితే, యుద్ధానికి ముగింపు పలికే అంశంపై సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా మధ్య జరగనున్న చర్చల్లో తమ దేశం పాల్గొనదని ప్రకటించారు. ఉక్రెయిన్‌ పాల్గొనని చర్చల్లో వచ్చే ఫలితాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.

మంగళవారం అమెరికా- రష్యా మధ్య జరగనున్న చర్చలకు తమను ఆహ్వానించలేదని జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌ గైర్హాజరీలో ఆ చర్చల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోమని చెప్పారు. బుధవారం సౌదీ అరేబియాలో పర్యటించనున్నట్లు తెలిపిన జెలెన్‌స్కీ అమెరికా, రష్యా మధ్య చర్చలకు తన పర్యటనకు మధ్య సంబంధం లేదని కూడా తెలిపారు.

మరోవైపు, అమెరికా-రష్యా మధ్య సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌పై శాంతి చర్చలకోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్‌ విట్‌కోఫ్‌, జాతీయ భద్రతా సలహాదారు మైక్‌వాల్ట్జ్ కూడా సౌదీకి పయణమయ్యారు. ఈ సందర్భంగా రియాద్‌లోని కొందరు అధికారులు- ఈ చర్చలకు వేదిక కావడం సహా మధ్యవర్తిత్వంలోను తమ దేశం కీలకపాత్ర పోషించనుందని తెలిపారు.

సౌదీ వేదకగా మంగళవారం జరగనున్న చర్చల్లో రష్యా అధికారులు అమెరికా ప్రతినిధులతో భేటీ అవుతారని క్రెమ్లిన్ సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీకి ఏర్పాట్లు చేస్తారని తెలిపింది. 

ఇందుకోసం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి ఉష్కోవ్ సౌదీ రాజధాని రియాద్కు పయనం కానున్నారని వెల్లడించింది. అమెరికా, రష్యా సంబంధాలను పునరుద్ధరించడం, ఉక్రెయిన్తో సెటిల్మెంట్, ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయని తెలిపారు.

ఉక్రెయిన్‌ లేకుండానే ఈ చర్చలు చేపడతున్నారంటూ అమెరికా మిత్రదేశాల నుంచి ఇటీవల వెల్లువెత్తిన అసంతృప్తులపై ట్రంప్‌ స్పందించారు. యుద్ధాన్ని ముగించే ఏ చర్చల్లోనైనా జెలెన్‌స్కీ భాగస్వామి అవుతారని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా చాలా తొందరలో రష్యా అధినేతతో తాను భేటీ కానున్నట్లు తెలిపారు.