ఒమన్ తీరంలో ఆదివారం 14 మంది భారతీయ నావికులకు గండం తప్పింది. భారతీయ జెండాతో బయలుదేరిన వాణిజ్య నౌక విరాట్ 1 సముద్రంలో ఉండగా ఇంజిన్‌లో సమస్యలు తలెత్తాయి. దీనితో నౌక మొరాయించింది. మునక ముప్పు దశలో భారతీయ నావికులను సురక్షితంగా తరలించారు. వారంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని ముంబైకి వెళ్తున్న మరో నౌకలో వారిని ఎక్కించినట్లు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా నావికా సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆపదలో ఉన్న వారిని నౌక నుంచి బయటకు తీసుకురావడంలో సహకరించారు. అసలే గల్ఫ్, ఒమన్,, హర్మూజ్ ప్రాంతాలలో నౌకలపై దాడులు, ముగ్గురు నావికులు బలి కావడం వంటి ఘటనల నేపధ్యంలో తిరిగి భారతీయ నౌకకు ముప్పు తలెత్తింది.
అయితే ఇది దాడుల సమస్య కాదని, ఇంజిన్‌లో లోపాలతో ఏర్పడ్డ సమస్య అని ఎంబసీ తెలిపింది. సహాయక చర్యలకు యుఎస్ నెవీ సమన్వయం వహించింది.
ఒమన్ తీరం నుంచి బయలుదేరిన నౌక రాస్ అల్ హాద్ వద్ద ఆదివారం ఉదయం వెళ్లుతూ ఉండగా ఇంజిన్ పనిచేయకుండా పోయింది. నావికులు సముద్రంలో మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారని అమెరికా నావిక దళం అక్కడి తీర ప్రాంత అధికారులకు అలర్ట్ పంపించారు. వెంటనే సహాయక బృందాలు రావడంతో భారతీయ నావికులకు ప్రాణాపాయం తప్పింది. ముందుగా వారిని లైఫ్‌రాఫ్ట్‌ల సాయంతో పనిచేయకుండా ఉన్న నౌక నుంచి తీరానికి చేర్చగలిగారు. పరిస్థితిని ఒమన్ తీర ప్రాంత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కాగా, ఒమన్ తీర ప్రాంతానికి సమీపంలో ఓ చమురు ట్యాంకర్‌లో విధులు నిర్వహిస్తున్న భారతీయ నావికుడు నిశాంత్ ఉర్తనాథన్ అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఘటనపైనా రాయబార కార్యాలయం స్పందించింది. నిశాంత్ కుటుంబసభ్యులు, ఆ నౌక సిబ్బంది సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఆయన భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా నౌక నుంచి దించి స్వదేశానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నది.

More Stories
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం..19న స్విట్జర్లాండ్లో సంతకాలు
మహిళల టీ20 ప్రపంచకప్లో పాక్ పై ఘన విజయం
వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా గిల్