
శ్రీవారి లడ్డూల తయారీకి నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన కేసులో పాత్రధారులెవరన్నది సిట్ బృందం దాదాపుగా తేల్చేసింది. ఇక సూత్రధారుల కోసం వేట మొదలుపెట్టబోతోంది. ఇప్పటి వరకూ చేసిన దర్యాప్తు ఆధారంగా ఈ వ్యవహారంలో టీటీడీకి సంబంధించిన 12 మంది అధికార, అనధికార ముఖ్యుల ప్రమేయం ఉందని సిట్ భావిస్తోంది.
విచారణ మరో రెండు మూడు నెలలు కొనసాగనుందని, అప్పటికిగానీ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని సమాచారం. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ఈ విచారణలో పాత్రధారులను గుర్తించింది. వారి నుంచి సూత్రధారులను తేల్చే ప్రక్రియను సిట్ మొదలు పెట్టింది. గతంలో కీలక వ్యవహరించిన ఓ కీలక అధికారితో పాటుగా పాలకమండలికి చెందిన ముఖ్యుడిని ఒకరిని విచారణకు పిలిచేందుకు నోటీసులు జారీ చేయనున్నారు.
వీరి విచారణ సమయంలో అనూహ్య నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. మిగిలిన వారిలో ముగ్గురిని నేరుగా అదుపులోకి తీసుకునే, అరెస్టుకు సైతం అవకాశాలున్నాయని తెలిసింది శుక్రవారం జ్యుడిషియల్ కస్టడీ నుంచి కోర్టు ద్వారా తమ కస్టడీకి తీసుకున్న ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్, భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవీ డెయిరీ సీఈవో వినయ్‌కాంత్ చావ్డాలను సిట్ అధికారులు రెండవ రోజైన శనివారమూ విచారించారు.
సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, సీబీఐ డీఐజీ మురళీ రాంబా శనివారం కూడా ప్రధాన నిందితులు నలుగురినీ వేర్వేరుగా ప్రశ్నించారు. ఏ ప్రశ్న వేసినా నలుగురూ కూడబలుక్కున్నట్టు ఒకే రకమైన సమాధానం ఇచ్చారని తెలిసింది. అయితే, నిందితుల నుంచి రెండో రోజు విచారణలో సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు.
టెండర్లు దక్కించుకున్న ఏఆర్ డెయిరీ పేరుతో ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ నెయ్యి సరఫరా చేయడంతోనే అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. కల్తీ నెయ్యి సరఫరా గుట్టు తేల్చే దిశలో నిందితులను సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. టీటీడీ నిర్వహించిన నెయ్యి సరఫరా టెండర్లలో అర్హత లేకున్నా ఎలా పాల్గొన్నారు?
ఏఆర్ డెయిరీ వేసిన టెండర్ ఈఎండీ మొత్తం భోలేబాబా డెయిరీ ఎందుకు చెల్లించింది? టీటీడీ అవసరాలకు సరిపడా నెయ్యి సరఫరా చేసే సాంకేతిక సామర్థ్యం లేకున్నా టెక్నికల్ బిడ్‌లో ఆమోదం ఎలా పొందారు? శ్రీ వైష్ణవి డెయిరీ కార్యనిర్వహణాధికారి కలీకుల్లాఖాన్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు? అర్హత లేకున్నా ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకోవడానికి సహకరించిన పెద్ద వ్యక్తి ఎవరు? అంటూ సిట్ వేసిన ప్రశ్నల పరంపరతో కల్తీ నెయ్యి నిందితులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
కాగా, తిరుపతి సిట్ కార్యాలయంలో దర్యాప్తు బృందంతో సీబీఐ అధికారులు సమావేశమయ్యారు. ఇప్పటి వరకూ కొనసాగిన దర్యాప్తు గురించి సమీక్షించుకున్న అనంతరం తదుపరి దర్యాప్తు ఎలా చేపట్టాలన్న దానిపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. టీటీడీ అధికారులు, పాలకమండలికి సంబంధించిన వ్యక్తులను ఎవరెవరిని విచారించాలో లోతుగా చర్చించినట్టు సమాచారం. ఇక సిట్ దర్యాప్తులో టీటీడీ అధికార యంత్రాంగం ప్రధానంగా ల్యాబ్‌కు సంబంధించి ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత