
భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఓటు ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్పేందుకు అనేక రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు, దివ్యాంగుల కోసం తగిన ఏర్పాట్లు ఇలా అనేక రకాలుగా భారత ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తోంది.
అయితే భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా సర్కార్ రూ.183 కోట్లు కేటాయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బైడెన్ సర్కార్ హయాంలోకేటాయించిన ఈ నిధులను ప్రస్తుతం ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్ మస్క్ నేతృత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిసియెన్సీ-డోజ్ నిలిపివేసింది.
ఈ మేరకు భారత్ సహా వివిధ దేశాల్లో వివిధ కార్యక్రమాలకు కేటాయించిన నిధులను నిలిపివేసినట్లు డోజ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు పలు దేశాల్లో వివిధ కార్యక్రమాలకు కేటాయించారని వాటిని రద్దుచేస్తున్నామని డోజ్ వివరించింది.
అయితే భారత్‌లో పోలింగ్ శాతం పెంపునకు 21 మిలియన్ డాలర్లను అమెరికా కేటాయించడంపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది భారత ఎన్నికల ప్రక్రియలో బయటి శక్తులు జోక్యం చేసుకోవడమేనని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిధుల ద్వారా ఎవరికి లబ్ది జరిగిందని ప్రశ్నించిన ఆయన కచ్చితంగా అధికార పార్టీ లబ్దిపొందలేదని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో డోజ్ అధిపతి అయిన ఎలాన్ మస్క్‌తో సమవేశమయ్యారు. భారత్, అమెరికా సంస్థల మధ్య సంబంధాల బలోపేతం, ఆవిష్కరణలు, అంతరిక్ష కార్యక్రమాలు, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, సుస్థిరాభివృద్ధిపై మోదీ, మస్క్ చర్చలు జరిపారు. ఎలాన్ మస్క్‌తో జరిగిన చర్చల్లో మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు ప్రధాని పేర్కొన్నారు.
ప్రధాని పర్యటన ముగిసిన వారం లోపే భారత్‌లో చేయదలిచిన ఖర్చుకు సంబంధించి నిధులను డోజ్ నిలిపివేసింది. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి ముందే సమాచారం ఉందా లేదా అనేది స్పష్టత రాలేదు.
కాగా, ఈ సందర్భంగా భారత ఎన్నికల కమిషన్, జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌తో అనుసంధానించబడిన ది ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ మధ్య కుదిరిన వివాదాస్పద 2012 అవగాహన ఒప్పందం (MoU) గురించి కూడా బీజేపీ నేత మాల్వియా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది ప్రధానంగా యుఎస్ ఎయిడ్ ద్వారా నిధులు సమకూరుస్తుంది.
“వ్యంగ్యంగా, భారత ఎన్నికల కమిషనర్‌ను నియమించే పారదర్శక, సమగ్ర ప్రక్రియను ప్రశ్నించే వారు – మన ప్రజాస్వామ్యంలో మొదటిసారి, గతంలో ప్రధానమంత్రి మాత్రమే నిర్ణయం తీసుకున్నారు – భారత ఎన్నికల కమిషన్ మొత్తాన్ని విదేశీ నిర్వాహకులకు అప్పగించడానికి ఎటువంటి సంకోచం లేదు” అని మాల్వియా మండిపడ్డారు.
“కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ, దేశ ప్రయోజనాలకు వ్యతిరేక శక్తులు – ప్రతి అవకాశంలోనూ భారతదేశాన్ని బలహీనపరచాలని ప్రయత్నించే వారు – భారతదేశ సంస్థలలోకి క్రమపద్ధతిలో చొరబడటానికి వీలు కల్పించిందని స్పష్టంగా కనిపిస్తోంది” అని ఆయన ఆరోపించారు.
More Stories
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
నాగ్‌పుర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం?