యూఎస్ మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల నియామకాలపై నిషేధం

యూఎస్ మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల నియామకాలపై నిషేధం

మహిళా క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆ దేశ మిలిటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌ల నియామకాన్ని నిషేధించారు. ఈ మేరకు అమెరికా సైన్యం ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసింది.

‘ట్రాన్స్‌జెండర్లు సైన్యంలో చేరడాన్ని అమెరికా మిలిటరీ విభాగం నిషేధిస్తుంది. అదే విధంగా సర్వీసులో ఉండగా, లింగమార్పిడి విధానాలకు అనుమతించబోం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. అమెరికాకు సేవ చేయాలనుకునే జెండర్ డిస్ఫోరియా వ్యక్తులను మేం గౌరవిస్తాం. తమను తాము ట్రాన్స్‌జెండర్‌గా భావించే వారి నియామకాలను ఆపేస్తున్నాం. ఇప్పటికే సర్వీసులో ఉన్నవారు లింగమార్పిడి చేయించుకోవడానికి సంబంధించిన వైద్య ప్రక్రియలను నిలిపి వేస్తున్నాం ’ అని రాసుకొచ్చారు. 

ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా ట్రాన్స్‌జెండర్లు సాయుధ దళాల్లో చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే మిలిటరీలో పనిచేస్తున్న వారిని కొనసాగించారు. ఇక ప్రమాణ స్వీకారానికి ముందు నిర్వహించిన ర్యాలీలో మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. తాజాగా ఆర్మీలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని తొలగించారు.