గాజాలో అమెరికా ఎత్తుగడలకు సౌదీ చెక్

గాజాలో అమెరికా ఎత్తుగడలకు సౌదీ చెక్

ఇజ్రాయెల్‌ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వాధీనం చేసుకుని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనకు విరుద్ధంగా సౌదీ అరేబియా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గాజాను స్వాధీనం చేసుకోవడానికి పథక రచన చేస్తున్న ట్రంప్‌ ప్రణాళికకు ప్రత్యామ్నాయ విధానాన్ని సౌదీ అరేబియా నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

హమాస్‌ను దూరం పెట్టి గల్ఫ్‌ దేశాల నేతృత్వంలో గాజా పునర్నిర్మాణానికి నిధిని సమకూర్చేలా ప్రతిపాదన ఉన్నట్లు తెలిపాయి. గాజా పునర్నిర్మాణంలో భాగంగా అక్కడ నివసిస్తున్న పాలస్తీనా ప్రజలకు ఈజిప్టు, జోర్డాన్‌లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్‌ ప్రతిపాదనకు ఆయా దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. 

ఈ నేపథ్యంలో గాజా అభివృద్ధికి కొత్త పథకాన్ని తయారు చేసి ట్రంప్‌ ముందుకు తీసుకెళ్లాలని గల్ఫ్‌ దేశాలు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే గాజా భవిష్యత్తు కోసం 4 ప్రతిపాదనలు అరబ్‌ దేశాలు రూపొందించినట్టు సమాచారం. వాటిలో ట్రంప్‌ ఆలోచనకు ప్రత్యామ్నాయంగా ఈజిప్టు చేసిన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఆయా దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

హమాస్‌ ప్రమేయం లేకుండా గాజాను పాలించేందుకు జాతీయ పాలస్తీనా కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్ట్‌ తన ప్రతిపాదనలో సూచించింది. పాలస్తీనా ప్రజలను విదేశాలకు తరలించకుండా అంతర్జాతీయ భాగస్వామ్యంతో గాజా అభివృద్ధి చేపట్టాలని ప్రతిపాదించింది. ఫిబ్రవరి 27న రియాద్‌లో జరగను‌న్న అరబ్‌ శిఖరాగ్ర సమావేశంలో ఈజిప్ట్‌ ప్రతిపాదనపై సౌదీ అరేబియా, ఈజిప్టు, జోర్డాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఈ చర్చల్లో ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కీలకంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నాయి.ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రస్తుతానికి గాజా అభివృద్ధి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పథకం ఒక్కటే ఉందని, అది నచ్చనివారు అంతకంటే మెరుగైన ప్రణాళికతో ముందుకు రావాలని అరబ్‌ శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశిస్తూ సూచించారు. 

గాజాను పాలించే అంశంలో తాము జోక్యం చేసుకోబోమని ఇప్పటికే ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ తాము నిర్మించిన వాటిని నాశనం చేయదని హామీ ఇచ్చిన తర్వాతే గాజా పునర్నిర్మాణంలో ముందుకెళ్లాలని గల్ఫ్‌ దేశాలు భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.