
తెలంగాణను బీఆర్ఎస్ కుటుంబ పాలన చేసి అప్పులు చేసిందని, దోచుకుందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లాలో నేడు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేయగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విధంగా వ్యవహరిస్తుని విమర్శించారు.
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్నారని, ప్రణాళిక లేని పాలన సాగుతోంది, హామీలు అమలు చేయడంలో అసమర్థతను ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించారని, కానీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి విఫలమైందని, అధికారంలోకి వచ్చాక నిధుల కోసం భూములు అమ్మాలని మాత్రమే ఆలోచిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలలకు కనీసం రంగులు వేయలేని స్థితిలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల కోసం బీజేపీ రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటం చేస్తుందని కిషన్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.
బీజేపీ అభ్యర్థులను గెలిపించి, తగిన బుద్ధి చెప్పాలంటూ ఉపాధ్యాయులను, పట్టభద్రులను కోరారు. తెలంగాణ సీఎం ప్రతివారం ఢిల్లీలో అటెండెన్స్ వేయడం కొత్త ట్రెండ్ అయ్యిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇప్పటివరకు ఏ ఒక్క బీసీ సంఘం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేను సమర్థించలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీ ఎప్పటికీ బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సర్వే పూర్తయి, బీసీ సంఘాలు అనుమతిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం చేపిస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ కులం గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ . రాహుల్ గాంధీది ఏ కులమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలి అంటూ నిలదీశారు.
బీసీల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్, తమ నాయకుల కులం వెల్లడించడంలో ఎందుకు వెనుకడుగేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ స్థానాలు, ఒక పట్టభద్రుల స్థానం బీజేపీ ఖాతాలో పడతాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.
More Stories
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!
17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు!
నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు