చెర్నోబిల్ రియాక్టర్‌పై రష్యా డ్రోన్ దాడి!

చెర్నోబిల్ రియాక్టర్‌పై రష్యా డ్రోన్ దాడి!

ఉక్రెయిన్ కీవ్ ప్రాంతంలోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం రక్షణ కవచంపై గురువారం రాత్రి అధిక పేలుడు వార్‌హెడ్‌తో రష్యన్ డ్రోన్ దాడి జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ శుక్రవారం వెల్లడించారు. రేడియేషన్ స్థాయిలు పెరగలేదని జెలెన్‌స్కీతో పాటు యుఎన్ అణుశక్తి సంస్థ తెలియజేసింది.  అయితే, ఈ ఆరోపణలను రష్యన్ అధికారులు ఖండించారు. సంప్రదింపుల ద్వారా ఈ యుద్దాన్ని నిలుపుదల చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో టెలిఫోన్ సంభాషణల ద్వారా ప్రారంభించిన ప్రయత్నాలను విఫలం చేసేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు విమర్శించారు.

అయితే, రష్యా బాధ్యత ఉందన్న ఉక్రెయిన్ వాదనను స్వతంత్రంగా ధ్రువీకరించడం సాధ్యం కాదు. యుఎన్ అణుశక్తి సంస్థ ఇందుకు ఎవరిపైనా నింద వేయలేదు. ఆ ప్రదేశంలో గల తమ బృందం పేలుడును విన్నదని, డ్రోన్ రక్షణ కవచాన్ని ఢీకొన్నదని మాత్రమే ఆ సంస్థ తెలిపింది. డ్రోన్ దాడి కట్టడాన్ని దెబ్బ తీసిందని, మంటలు వ్యాపించాయని, కానీ ఆ మంటలనే ఆర్పివేయడమైందని జెలెన్‌స్కీ తెలిపారు. 

ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నిలిపివేయడంపై చర్చించేందుకు తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అవుతానని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రెండు రోజుల తరువాత ఈ దాడి జరిగింది. యుద్ధం విషయంలో తాను చర్చించవలసింది పుతిన్ ఒక్కరితోనే అని ట్రంప్ ఈ విధంగా సూచించినట్లు అయింది. శాంతి చర్చల్లో జెలెన్‌స్కీని,యూరోపియన్ ప్రభుత్వాలను ఆయన పక్కన పెట్టబోతున్నట్లు విదితం అవుతోంది. 

కాగా, చెర్నోబిల్‌పై దాడి గురించి మ్యూనిచ్ భద్రత సమ్మేళనంలో యుఎస్ అధికారులకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉక్రెయిన్ భావిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం అధిపతి ఆంద్రీ యెర్మాక్ తన టెలిగ్రామ్ చానెల్‌లో తెలిపారు. చెర్నోబిల్ దాడి స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 1.50 గంటలకు సంభవించిందని యుఎన్ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఎఇఎ) తెలియజేసింది. 

‘రక్షణ కవచంలో రేడియేషన్ వెలువడిన సూచన ఏదీ లేదు’ అని సంస్థ తెలిపింది. ఆ ప్రదేశంలో గల తమ సిబ్బంది దాడి జరిగిన కొన్ని నిమిషాల్లోనే స్పందించారని, ప్రాణ నష్టం ఏదీ లేదని సంస్థ వివరించింది. పుతిన్ సంప్రదింపులకు కచ్చితంగా సన్నద్ధం కావడం లేదని చెర్నోబిల్ దాడి స్పష్టం చేస్తున్నదని జెలెన్‌స్కీ టెలిగ్రామ్ వేదికలో ఒక పోస్ట్‌లో ఆరోపించారు. ‘జరుగుతున్నదానికి రష్యాను జవాబుదారీ చేయాలి’ అని ఆయన కోరారు.