సీమాంతర ఉగ్రవాదం ప్రకటనపై పాక్ మండిపాటు

సీమాంతర ఉగ్రవాదం ప్రకటనపై పాక్ మండిపాటు

సీమాంతర ఉగ్రవాదంపై భారత్- అమెరికా సంయుక్త ప్రకటన ఏకపక్షమంటూ పాకిస్థాన్ విమర్శించింది. డోనాల్డ్ ట్రంప్‌- నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో సీమాంతర ఉగ్రవాదానికి తన భూభాగం వాడుకోకుండా పాక్ చూసుకోవాలని పేర్కొన్నారు. 

దీనికి పాక్ విదేశాంగ శాఖ ఇది పూర్తిగా ఏకపక్షంగా ఉందని ఆరోపించింది. ముంబై దాడుల కుట్రదారు తహపూర్ రాణా అప్పగింతకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “తహవూర్ రాణా అప్పగింతకు నా కార్యవర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యక్తుల్లో ఒకడైన అతడు భారత్‌లో విచారణ ఎదుర్కోవాలి ” అని ట్రంప్ పేర్కొన్నారు.

దీనిపై ఇస్లామాబాద్ లోని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. భారత్ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదాన్ని విస్మరించారంటూ ఆరోపించారు. “ఇది పూర్తిగా ఏకపక్షం. తప్పుదోవ పచ్చించేది. దౌత్య నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. పాక్ త్యాగాలను లెక్కలోకి తీసుకోకుండానే దీనిలో చేర్చారు. ఇలాంటివి భారత ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమాత్రం కప్పిపెట్టలేవు.” అని పాక్ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదే సమయంలో రక్షణ పరంగా భారత్‌కు టెక్నాలజీ, ఆయుధాల సరఫరాపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌కు ఎఫ్35 విమానాలు సహా పలు ఆయుధాలు విక్రయించేందుకు ట్రంప్ ఆసక్తిని ప్రకటించిన సంగతి తెలిసిందే.