పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఆయుధాల తయారీలో ఉపయోగించేందుకు సిద్ధంగా వున్న శుద్ధి చేసిన యురేనియం ఇరాన్‌లోనే వుండాలని, దాన్ని విదేశాలకు పంపడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో శాంతి చర్చల్లో అమెరికా ప్రధాన డిమాండ్ అయిన యురేనియంపై టెహ్రాన్ వైఖరి మరింత క్లిష్టంగా మారింది.
ఇరాన్ నుండి యురేనియం తరలించకపోతే యుద్ధం ముగిసినట్లు కాదని ఇజ్రాయిల్ అంటోంది. ఏ ఒప్పందం కుదిరినా అందులో దీనిపై నిబంధన వుండాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, శుద్ధి చేసిన యురేనియంపై నియంత్రణను వదులుకుని, దానిని విదేశాలకు పంపడం దేశీయ భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఖమేనీ తెలిపారు. భవిష్యత్తులో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చొరబాట్లకు దారి తీస్తుందని, దేశాన్ని మరింత బలహీనపరుస్తుందని చెప్పారు.
కాగా, నెతన్యాహు ఇరాన్ విషయంలో భవిష్యత్ కార్యాచరణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నెతన్యాహులు బుధవారం ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నారని, ఇరాన్‌పై దాడులు పునరుద్ధరించే కన్నా ఒప్పందం కోసం చూడడం మేలనే అభిప్రాయానికి ట్రంప్ వచ్చినట్లు కనిపిస్తోందని అమెరికా మీడియా పేర్కొంది.
ఇరాన్‌పై త్వరగా యుద్ధాన్ని ప్రారంభించాలని నెతన్యాహు డిమాండ్ చేయగా ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు సాగుతున్నందున కొంతకాలంపాటు దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇద్దామని ట్రంప్ నిర్ణయించారు. కానీ, ఇరాన్‌పై సైనిక ఒత్తిడి తేవాలని, మళ్లీ దాడులు చేసి, ఆ దేశ సైన్యాన్ని ఇంకా బలహీన పర్చాలని, ఇరాన్‌లోని కీలక నిర్మాణాలపై దాడులు చేసి ధ్వంసం చేయాలని ట్రంప్‌నకు నెతన్యాహు సూచించారని మీడియా కథనాలు తెలిపాయి.
మరోవైపు పాక్ మధ్యవర్తి ద్వారా అందుకున్న అమెరికా ప్రతిపాదననను పరిశీలిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాగ్చి తెలిపారు. విదేశాల్లో స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని, ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనానికి స్వస్తి చెప్పాలన్న ఇరాన్ డిమాండ్లను పునరుద్ఘాటించారు. పాక్ హోం మంత్రి వారంలో రెండోసారి టెహ్రాన్‌లో పర్యటిస్తున్నారు.
ఒకవేళ ఏవైనా లోపాలు, లొసుగులు వున్నా వాటిని తగ్గించడానికి, అధికారిక అవగాహనను ప్రకటించడంలో సాయం చేయడానికే పార్ ఆర్మీ చీఫ్ కూడా టెహ్రాన్‌లో పర్యటిస్తున్నారని ఇరాన్ వార్తా సంస్థ ఐఎస్‌ఎన్‌ఎ తెలిపింది.
పశ్చిమాసియాలో యుద్ధం ఆగినప్పటికీ, 2027 జూన్ వరకు అంటే మరో ఏడాది వరకు హర్మూజ్‌లో పూర్తి స్థాయి రవాణా పునరుద్ధరణ జరగదని యుఎఇ చమురు దిగ్గజ కంపెనీ ఎడిఎన్‌ఓసి తెలియచేసింది. ఇరాన్ యుద్ధం కలిగించే సుదీర్ఘ ఆర్థిక ప్రభావాలపై పారిశ్రామికవర్గం చాలా నిరాశావాదంతో వుంది. జలసంధి దాదాపుగా మూతపడినందున అతిపెద్ద ఇంధన సంక్షోభం తలెత్తిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) ఇప్పటికే వ్యాఖ్యానించింది.

More Stories
ఇరాన్ యుద్ధంలో 42 సైనిక విమానాలు కోల్పోయిన అమెరికా
ఉద్యోగంతో పాటు అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు ముప్పు!
పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ పాక్ లో కాల్చివేత!