తన భర్త అనారోగ్య కారణాలను పేర్కొంటూ, తులసి గబ్బార్డ్ శుక్రవారం ట్రంప్ పరిపాలన నుండి వైదొలిగి, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవికి రాజీనామా చేశారు. 45 ఏళ్ల ఆమె, తన రాజీనామా లేఖను ఎక్స్ లో పంచుకున్నారు. అందులో, తన భర్త అబ్రహాంకు అత్యంత అరుదైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆమె పేర్కొన్నారు. రాబోయే వారాల్లో ఆయన “పెద్ద సవాళ్లను” ఎదుర్కోబోతున్నారని గబ్బార్డ్ తెలిపారు.
ఈ పోరాటంలో తన భర్తకు మద్దతుగా నిలవడానికే తాను ప్రజా సేవ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు. “మా పదకొండు సంవత్సరాల వైవాహిక జీవితంలో అబ్రహాం నాకు ఒక ఆసరాగా నిలిచారు. జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ మిషన్‌లో భాగంగా నేను తూర్పు ఆఫ్రికాకు వెళ్లినప్పుడు, పలు రాజకీయ ప్రచారాలలో పాల్గొన్నప్పుడు, ఇప్పుడు ఈ పదవిలో నా సేవలో కూడా ఆయన స్థిరంగా నిలబడ్డారు,” అని గబ్బార్డ్ చెప్పారు.
“ప్రతి సవాలులోనూ ఆయన బలం, ప్రేమ నన్ను నిలబెట్టాయి. నేను ఈ శ్రమతో కూడుకున్న, సమయం తీసుకునే పదవిలో కొనసాగుతుండగా, ఈ పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కోమని నేను మనస్సాక్షిగా ఆయనను అడగలేను,” అని ఆమె తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా గబ్బార్డ్ ధన్యవాదాలు తెలిపారు.
అధ్యక్షుడు, అతని బృందం నాయకత్వంలో గానీ, పని వేగంలో గానీ ఎలాంటి అంతరాయం కలగకుండా, సున్నితమైన, సమగ్రమైన పరివర్తన జరిగేలా చూడటానికి తాను కట్టుబడి ఉన్నానని ఆమె పేర్కొన్నారు. “మా కుటుంబానికి ఇది అత్యంత వ్యక్తిగతమైన, కష్టమైన సమయం, ఈ సమయంలో మీరు చూపిస్తున్న అవగాహనకు ధన్యవాదాలు,” అని ఆమె తెలిపారు,
“డిఎన్ఐగా మన దేశానికి సేవ చేసే గొప్ప గౌరవాన్ని ఇచ్చినందుకు మీకు, అమెరికా ప్రజలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటాను” అని చెప్పారు. హవాయికి చెందిన మాజీ డెమోక్రటిక్ కాంగ్రెస్ మహిళ అయిన గాబార్డ్, ట్రంప్ రెండోసారి వైట్ హౌస్‌కు తిరిగి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు.
ఆమె ఎనిమిదవ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డిఎన్ఐ)గా పనిచేశారు. గాబార్డ్ రాజీనామా దురదృష్టకరమని ట్రంప్ పేర్కొన్నారు. డిఎన్ఐగా ఆమె పదవీకాలంలో “గొప్ప పని” చేశారని కొనియాడారు. గాబార్డ్ జూన్ 30న తన పరిపాలన నుండి వైదొలుగుతారని ఆయన చెప్పారు.

More Stories
ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌరపురస్కారం
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్రిటన్ నిషేధం
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం..19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు