అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత

అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ కన్నుమూశారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. ఇక అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ మృతి నేపథ్యంలో  ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు. 
 
ఆచార్య సత్యేంద్ర దాస్‌ అంత్య క్రియలు ఈరోజే జరుగనున్నాయి. యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రమే ఆసుపత్రికి సందర్శించి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.  ఆచార్య దాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.

ఎక్స్ లో ఒక పోస్ట్‌లో, “శ్రీరాముని అత్యున్నత భక్తుడు, శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య శ్రీ సత్యేంద్ర కుమార్ దాస్ జీ మహారాజ్ మరణం చాలా విచారకరం. ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు. వినయపూర్వకమైన నివాళి!” “శ్రీరాముని ఆత్మకు ఆయన పాదాల వద్ద స్థానం కల్పించాలని, దుఃఖంలో ఉన్న శిష్యులు, అనుచరులకు ఈ అపారమైన నష్టాన్ని భరించే శక్తిని ఇవ్వాలని  ప్రార్థిస్తున్నాను” అని ఆయన తెలిపారు.

గత కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఫిబ్రవరి 3న లఖ్‌నవూలోని ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సత్యేంద్ర దాస్‌ మధుమేహం, బీపీతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడం వల్లే ఆయన పరిస్థితి విషమించిందని, వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు.

సత్యేంద్ర దాస్ 34 సంవత్సరాలుగా శ్రీరామ జన్మభూమిలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్నారు.  1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్‌ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. కూల్చివేతకు ముందు విగ్రహాలను సమీపంలోని ఫకీరే మందిరానికి తరలించి, రామజన్మభూమిలోని తాత్కాలిక ఆలయంలో ఉంచి పూజలు చేశారు.

సత్యేంద్ర దాస్ జీ 1945 మే 20న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో జన్మించారు. సత్యేంద్ర దాస్ కు చిన్నప్పటి నుంచి రామ్ పై అపారమైన ప్రేమ ఉండేది. తన గురువు అభిరామ్ దాస్ జీ ప్రభావంతో, సత్యేంద్ర దాస్ సన్యాసం స్వీకరించి 1958లో తన ఇంటిని వదిలి ఆశ్రమంలో నివసించారు. ఆయన చాలా మతపరమైన వ్యక్తి. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు.

రామాలయంలో అనేక సంవత్సరాల పాటు పూజారిగా వ్యవహరించిన మహంత్ సత్యేంద్ర దాస్, అయోధ్య రామాలయ పరిణామాలపై దేశవ్యాప్తంగా ఉన్న పలు వర్గాల ప్రజలతో పర్యవేక్షణ, సంప్రదింపుల నిర్వహణలో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఆయన ప్రధాన పూజారిగా పనిచేయడంతోపాటు రామ్ లల్లా విగ్రహ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆచార్య సత్యేంద్ర దాస్ అయోధ్య వివాదాన్ని అన్వేషించే 2024 డాక్యుమెంటరీ సిరీస్ “ది బాటిల్ ఆఫ్ అయోధ్య”లో ప్రదర్శించారు.