సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి

సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి

1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. ముఖ్యంగా నవంబర్ 1, 1984న ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన ఘోర ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది. దీనిపై వాదనలు పూర్తయిన అనంతరం కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.

ఈ కేసులో శిక్ష ఖరారు చేయడం కోసం ఫిబ్రవరి 18న తదుపరి వాదనలు విననున్నట్లు కోర్టు తెలిపింది. నేరం తీవ్రతను బట్టి ఆయనకు గరిష్ఠ శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్య  అనంతరం దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అల్లర్లు వేలాది సిక్కుల ప్రాణాలను బలితీసుకున్నాయి.

అందులో ఈ కేసు కూడా ఒక భాగంగా నిలిచింది. ఇది తొలి సారి కాదు, గతంలో కూడా సజ్జన్ కుమార్ పై వివిధ ఘటనలకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. 1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్య కేసులో కోర్టు ఆయనను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.  ఊచకోత కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. తీర్పు సందర్భంగా సజ్జన్ కుమార్‌ను తీహార్ జైలు నుంచి బుధవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు.

ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. అల్లరిమూక సింగ్, ఆయన కుమారుడిని హత్య చేసి ఇల్లు లూటీ చేసిందని, ఆ తర్వాత ఇంటికి నిప్పుపెట్టిందని ప్రాసిక్యూషన్ పేర్కొంది. సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది.

తాజాగా సరస్వతీ విహార్ ఘటనలోనూ కోర్టు ఆయనను దోషిగా తేల్చడంతో, ఆయనపై మరిన్ని శిక్షలు పడే అవకాశముంది. సిక్కుల ఊచకోత కేసులో న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాన్ని బాధిత కుటుంబాలు స్వాగతించాయి. దశాబ్దాలుగా న్యాయం కోసం పోరాడుతున్న వారు, ఇలాంటి తీర్పులు బాధితులకు కొంత ఊరటనిస్తాయని పేర్కొన్నారు. 

సజ్జన్ కుమార్‌ను దోషిగా కోర్టు ప్రకటించడాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజిమెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) ప్రధాన కార్యదర్శి జగ్‌దీప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా సిట్‌ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మూసేసిన కేసులను తిరిగి ఇన్వెన్సిగేట్ చేయడం వల్ల ఈ ఫలితం వచ్చిందని, జగ్‌దీష్ టైట్టర్ల విషయంలోనూ న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నామని చెప్పారు.

అయితే, నిందితులకు గరిష్ఠ శిక్ష విధించాలి, బాధితులకు పూర్తి న్యాయం చేయాలి అంటూ పలువురు సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద, ఈ కేసులో కోర్టు తీర్పు మరో కీలక మలుపుగా మారింది. దేశ చరిత్రలో దారుణమైన ఊచకోత ఘట్టంగా నిలిచిన 1984 సిక్కుల ఊచకోత ఘటనపై న్యాయపరంగా ఇంకా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి.