కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు

కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు

ప్రయాగరాజ్ లో జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు క్యూ క‌డుతున్నారు. త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. తాజాగా ఈ ప‌విత్ర కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు దాయాది పాకిస్థాన్ నుంచి 68 మంది హిందువులు కూడా ప్రయాగరాజ్ వ‌చ్చారు. 

త్రివేణి సంగమంలో ప‌విత్ర స్నానాలు ఆచ‌రించారు. అనంత‌రం అక్క‌డి ఘాట్‌ల‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాము సింధ్ ప్రావిన్స్ నుంచి వ‌చ్చామ‌ని చెప్పారు. జీవితంలో ఒక్క‌సారి మాత్ర‌మే వచ్చే ఈ ప‌విత్ర సంద‌ర్భాన్ని మిస్ చేసుకోకూడ‌ద‌నే ఉద్దేశంతో ఇండియాకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

ఈ మ‌హత్త‌ర కార్య‌క్ర‌మం ద్వారా హిందు మ‌తం గొప్ప‌త‌నాన్ని తొలిసారిగా మ‌రింత లోతుగా అర్థం చేసుకునే అవ‌కాశం ద‌క్కింద‌ని తెలిపారు. హ‌రిద్వార్ వెళ్లి త‌మ పూర్వీకుల అస్థిక‌ల్ని గంగ‌లో క‌లిపామ‌ని వారు చెప్పారు. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందంటూ పాక్ హిందువులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
 
కాగా, మహాకుంభమేళాలో శుక్రవారం వరకు 42 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ సంఖ్య అమెరికా, కెనడా దేశాల్లోని ప్రజల కంటే ఎక్కువ కావడం విశేషం. గతనెల 13న ప్రారంభమై ఈనెల 26తో ముగిసే ఈ మహా ఉత్సవంలో పుణ్యం స్నానం చేసే వారి సంఖ్య 50 కోట్లు దాటుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

త్రివేణి సంగంలో శుక్రవారం 48 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా మహాకుంభమేళా జనవరి 26న ముగియనున్నది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. 
 
మౌని అమావాస్యనాడు అత్యధికంగా ఎనిమిది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇక సంక్రాంతి నాడు 3.5 కోట్ల మంది భక్తులు, బసంత్ పంచమినాడు 2.7 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారు. ఇంకా జనవరి 30న రెండు కోట్లకు పైగా భక్తులు, పౌష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది పవిత్ర నదీ స్నానం ఆచరించారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులు పుణ్యస్నానం ఆచరించారు.  వీరేకాక నటీనటులు హేమా మాలిని, అనుపమ్ ఖేర్, ఒలింపిక్స్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్, కొరియోగ్రాఫర్ రెమె డిసౌజా తదితర ప్రముఖులు కూడా పుణ్యస్నానం ఆచరించారు.
ఇదిలావుండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రయాగ్‌రాజ్ చేరుకుని పవిత్ర స్నానం ఆచరిస్తారని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బిహార్‌ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ శుక్రవారం సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు.