
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలకు ఈడీ షాకిచ్చింది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హయాగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులుగా ఈడీ తేల్చింది. ప్లాట్లు అమ్మి దాదాపు రూ.150 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది.
ఎంవీవీ, జీవీ ఇళ్లు, కార్యాలయాల్లో గత ఏడాది అక్టోబరులో సోదాలు నిర్వహించింది. నకిలీ పత్రాలు సృష్టించే డిజిటల్ పరికరాలు సహా, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. విశాఖ హయగ్రీవ భూముల్లో జరిగిన కుంభకోణాన్ని ఈడీ బట్టబయలు చేసింది. వృద్ధులు, అనాథలకు సేవ చేయడానికి కేటాయించిన భూముల్ని వైఎస్సార్సీపీ నేతలు అన్యాక్రాంతం చేసినట్టు దర్యాప్తులో తేల్చింది.
ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్టుకు సంబంధించిన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా లాక్కున్నారని గతేడాది జూన్ 22న చిలుకూరి జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. 2008లో చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు ఎండాడలో 12.51 ఎకరాలను ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించింది.
ఆడిటర్‌గా రంగప్రవేశం చేసిన జీవీ, ప్రాజెక్టు అభివృద్ధి కోసం గద్దె బ్రహ్మాజీని పరిచయం చేశారు. తదనుగుణంగా ఒక ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత జీవీ చేతుల్లోకి ప్రాజెక్టు వెళ్లిపోయింది. ఆయన ఆ భూమికి జీపీఏ హోల్డర్. ‘2020లో మా సంతకాలు ఫోర్జరీ చేశారు. అమ్మకపు పత్రాలు తయారు చేసి బలవంతంగా విలువైన ఆస్తిని లాక్కోవడానికి నేర పూరితంగా వ్యవహరించారు. సేల్‌డీడ్‌లను దుర్వినియోగం చేశారు.’
జగదీశ్వరుడు ఆరిలోవ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎంవీవీ, జీవీ, గద్దె బ్రహ్మాజీలపై కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ గతేడాతి అక్టోబర్‌లో ఎంవీవీ, ఆయన స్నేహితుడు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు.
విశాఖ రుషికొండలోని ఎంవీవీ నివాసం, లాసన్స్ బే కాలనీలోని కార్యాలయం, ఇల్లు, జీవీ స్కేర్‌లోని ఆడిటర్ జీవీ కార్యాలయం, ఇంటిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనేక డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ జరిపిన ఈడీ తాజాగా హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
More Stories
ఏపీలో శ్రీకాకుళంలో కొత్తగా ఎయిర్ పోర్ట్
తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలి
అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్లడం ఏంటి?