పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ఢిల్లీలో విజయం

పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ఢిల్లీలో విజయం
 
* శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
 
ఢిల్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం చరిత్రాత్మకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. పీపుల్స్ ఫస్ట్ అనే నినాదమే బీజేపీని గెలిపించిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని మోదీపై నమ్మకంతోనే దేశ రాజధానిలో బీజేపీ గెలిచిందని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిందని, ఢిల్లీ నుంచి చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. 
 
సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలికవసతులు వస్తాయని పేర్కొంటూ సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలుకుతుందని చెప్పారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, వాటిని తెలుగుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తీసుకొచ్చారని పేర్కొన్నారు. 1995- 2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో 3 వేల డాలర్ల తలసరి ఆదాయం ఉందని, బిహార్‌లో అది ఇంకా 750 డాలర్లుగానే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ సాయంతో మనం ముందుకెళ్లామని, మనకు ఐటీ, మౌలిక వసతులు గేమ్‌ఛేంజర్‌గా మారాయని సీఎం చెప్పుకొచ్చారు. 

సరైన సమయంలో సరైన నాయకత్వం చాలా కీలకమైన విషయమని, భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు నరేంద్ర మోదీ అని చంద్రబాబు కొనియాడారు. స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్.. గుజరాత్ అభివృద్ధికి కారణం అయ్యాయన చెబుతూ కొందరు నేతలు సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. అలాంటి నేతల కారణంగా రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోందని ధ్వజమెత్తారు. 

ఆప్ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని, కొన్ని విధానాలతో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పరిశుభ్రతను ఆప్ ప్రభుత్వం పట్టించుకోలేదని, లిక్కర్ స్కామ్‌లో చిక్కుకున్న ఎవ్వరూ బాగుపడలేదని పేర్కొన్నారు. ఏపీ, ఢిల్లీలో ప్రజల ఆకాంక్షలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్‌ను కాటేశారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. 

సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో జగన్ రుషికొండ ప్యాలెస్ కడిత, ఢిల్లీలో కేజ్రీవాల్ శీష్‌మహల్ కట్టారని మండిపడ్డారు. ఏపీలో బటన్ నొక్కే వ్యక్తికి ప్రజలు విరామం ఇచ్చారని, అలాగే ఇప్పుడు ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

కాగా, ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, కూటమి పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. “2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు” అని తెలిపారు. 

“ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్రస్థాయికి చేరతాయి. ఢిల్లీ అభివృద్ధికి, ఆ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి” అని చెప్పారు. 

“ప్రధాని మోదీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ఢిల్లీ ప్రజలు విశ్వసించారు. దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అర్థం చేసుకున్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయానికి కారకులైన వారందరికీ హృదయపూర్వక అభినందనలు” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.