
బాంగ్లాదేశ్ లో దేశవ్యాప్తంగా అవామీ లీగ్ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేసి ధ్వంసం చేయడం, ఇళ్లను తగలబెట్టడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజబుర్ రహమాన్ కుడ్య చిత్రాలను నాశనం చేశారు. దాదాపు 24 జిల్లాల్లో ఇటువంటి హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి.
మాజీ ప్రధాని షేక్ హసీనా ఆన్‌లైన్‌లో ప్రసంగించిన తర్వాత ఈ అశాంతి పెచ్చరిల్లింది. యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని ఆమె అవామీ లీగ్ నేతలకు పిలుపునివ్వడంతో హసీనా వ్యతిరేకులు రెచ్చిపోయారు. ఢాకాలో అవామీ లీగ్ నేత షేక్ సలీమ్ ఇంటికి శుక్రవారం నిప్పంటించారు.
షేక్ ముజబుర్ రహమాన్ నివాసానికి నిప్పంటించిన తర్వాత ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి, మాజీ రోడ్డు రవాణా మంత్రి ఇళ్లపై దాడులు చేసి, దోచుకుని, దగ్ధం చేశారు. రాజ్‌షాహిలో ఆందోళనకారుల బృందం మాజీ మంత్రికి చెందిన మూడంతస్తుల ఇంటిని తగలబెట్టింది. వందమందికి పైగా ఆందోళనకారులు మోటార్‌బైక్‌లపై వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో, ప్రాంతాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయి, హింసకు పాల్పడ్డారు.
బుల్డోజర్లను తీసుకొచ్చి మరీ ఇళ్లను కూల్చివేశారు. గేట్లను విరిచి, ఇళ్లల్లోకి చొరబడి, వస్తువులను చెల్లాచెదురుచేసి, చేతికి అందిన వాటిని దోచుకుని, చివరగా వెళ్ళేటపుడు ఇళ్లకు నిప్పంటించడం వంటి ఘాతుకాలకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మరోవంక, భారతదేశం పట్ల బంగ్లాదేశ్ అధికారులు నిరంతరం ప్రతికూల వ్యాఖ్యలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం భారతదేశంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక హైకమిషనర్ ఎండీ నురల్ ఇస్లాంను పిలిపించింది. పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రసంగంపై బంగ్లాదేశ్ అధికారికంగా భారతదేశంతో “తీవ్ర నిరసన” నమోదు చేసింది. అయితే, భారతదేశం ఈ ప్రకటనకు సమాధానమిస్తూ ‘హసీనా ప్రకటనలో భారతదేశానికి ఎటువంటి పాత్ర లేదు’ అని స్పష్టం చేసింది.
విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, “భారతదేశంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక హైకమిషనర్ శ్రీ ఎండీ నురల్ ఇస్లాంను ఈరోజు ఫిబ్రవరి 7, 2025న సాయంత్రం 5:00 గంటలకు సౌత్ బ్లాక్‌కు పిలిపించింది. భారతదేశం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక మరియు పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని కోరుకుంటుందని తెలియజేశారు” అని తెలిపారు.
“ఇది ఇటీవలి ఉన్నత స్థాయి సమావేశాలలో చాలాసార్లు పునరుద్ఘాటించబడింది. అయితే, బంగ్లాదేశ్ అధికారులు చేసే క్రమం తప్పకుండా ప్రకటనలు భారతదేశాన్ని ప్రతికూలంగా చిత్రీకరిస్తూ ఉండటం విచారకరం. అంతర్గత పాలన సమస్యలకు మమ్మల్ని బాధ్యులుగా ఉంచడం విచారకరం. బంగ్లాదేశ్ చేసిన ఈ ప్రకటనలు వాస్తవానికి నిరంతర ప్రతికూలతకు కారణమవుతాయి” అని స్పష్టం చేసినట్లు చెప్పారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత