పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం

పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం

పాలమూరు -రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో స్పష్టంచేసింది. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.  పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుందని, అయితే ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ఇవ్వా ల్సి ఉందని మంత్రి తెలిపారు.

అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అడ్వైజరీ కమిటీ అనుమతి కూడా తప్పనిసరి అవసరమని వెల్లడించారు.  పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టెక్నో – ఎకనామికల్ అనుమతుల కోసం 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సీడబ్ల్యూసీకి సమర్పించిందని చెప్పారు.

పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది జలాలపై నిర్మించనున్నదని, అయితే కృష్ణా నది నీటి కే టాయింపు వివాదాలను పరిష్కరించే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్(కేడబ్ల్యూడీటీ—2) కు అప్పగించామని, ఇప్పుడు ఈ అంశం న్యాయస్థానం (ట్రిబ్యునల్) పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.

అంతే కాకుండా ఈ ప్రాజెక్టు అనుమతులకు ఇరు రాష్ట్రాల వివాదాలు అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. న్యాయవివాదాలు, నీటి కేటాయింపుల అంశం తేలకుండా పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టెక్నో – ఎకనామికల్ అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. వివాదాలు సమసిపోతే గాని ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోలేమని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు.