
తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది కొత్త పాలక మండలి. అన్యమత ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నది. టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు సొంత ఇంటిని చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు భక్తులపై ఫోకస్ చేసిన ఆయన, పాలనపై పట్టు సాధించే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగా టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. వారిపై బదిలీ వేటు పడింది. మొత్తం 18 మంది ఉద్యోగులను బదిలీ చేసింది పాలకమండలి. అధికారుల నుంచి వెలువడుతున్న నివేదికల ప్రకారం తొలుత 18 మందిని బదిలీ చేశారు. ఇంకా 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయు ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లో లెక్చరర్లు, వసతి గృహాల వార్డెన్ వంటి వారు ఉన్నారు. కొండపై పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది అన్యమతస్థులు ఉన్నట్లు అంతర్గత సమాచారం. త్వరలో వారిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
1989 ఎండోమెంట్ యాక్ట్ మేరకు హిందూమత సంప్రదాయాలను అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొందిన వీరి అన్యమతాలను అనుసరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీయడంతో పాటు భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న వీరిపై ఈవో క్రమశిక్షణ చర్యలకు అదేశించారు. అన్యమతాలను అనుసరిస్తున్న ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధుల్లో నియమించవద్దని అదేశించారు.
గడిచిన ఐదేళ్లలో టీటీడీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తిరుమలలో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోందంటూ ఆరోపణలు లేకపోలేదు. ఇతర మతస్తులను ఉన్నత ఉద్యోగాల్లో నియమించారని, మాంసాహారం, గంజాయి, మద్యం విరివిగా కొండపై దొరుకుతున్నాయని భక్తులు, హిందూ మతస్తుల ప్రధాన ఆరోపణ.
ఇలాంటి వ్యవహారాల వల్ల తిరుమల పవిత్రత దెబ్బతినే అవకాశముందని ఆందోళన సైతం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఈ క్రమంలో టీటీడీ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తిరుమల పవిత్రకు భంగం కలిగిస్తున్న వారిలో 69 మందితో కూడిన జాబితా చైర్మన్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో కొందరిపై వేటు పడినట్టు చెబుతున్నాయి తిరుమల వర్గాలు. రేపో మాపో మరికొందరిపై వేటు పడడం ఖాయమన్నమాట.
More Stories
తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలి
అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్లడం ఏంటి?
ఎపి ప్రభుత్వ సలహాదారులుగా సతీష్‌రెడ్డి, సుచిత్ర ఎల్ల