గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం 

గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం 
 
* రాష్ట్ర ప్రభుత్వం సందేహాలు తీర్చాలన్న ఎస్సీ.,ఎస్టీ., హక్కుల సంక్షేమ వేదిక
 
పర్యాటక అభివృద్ధికి గిరిజన చట్టాలను సవరించాలని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు సూచించడం పట్ల ఎస్సీ.,ఎస్టీ., హక్కుల సంక్షేమ వేదిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రకటనలతో గిరిజనులలో అపోహాలు పెంచవద్దని ఎస్సీ.,ఎస్టీ.,హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గరికముక్కు సుబ్బయ్య హితవు చెప్పారు. ఈ విషయమై గిరిజన నాయకులలో నెలకొన్న సందేహాలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని ఆయన కోరారు.
 
గిరిజనులకు ఒక విశిష్ట సంస్కృతి జీవన విధానం ఉన్నాయని, వీటిని కాపాడుతూ వీరి అభివృద్ధికి పనిచేయాలని ప్రభుత్వాలకు రాజ్యాంగం నిర్దేశించిందని ఆయన గుర్తు చేశారు. అయితే, ఇప్పటికే వివిధ పార్టీల ప్రభుత్వాలు  ఎస్టీల హక్కులను పట్టించుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. పర్యాటకం పేరుతో గిరిజన ప్రాంతాల్లోకి ఇతర ప్రజలు వెళ్లి త్రాగి అక్కడ అన్ని విధాలా కాలుష్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు.
 
ఉదాహరణకు మారేడుమిల్లి లోని గుడిసె గడ్డి మైదానాలలో పర్యాటకులు వదిలిన చెత్తను తరలించలేక  గిరిజన, అటవీ శాఖలు మధ్య మధ్యలో నిషేధం విధిస్తున్నారని సుబ్బయ్య గుర్తు చేశారు. విచ్చల విడిగా సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వటం వల్ల, ప్రచార ప్రభావం వల్ల  వేలం వెర్రిగా వస్తున్న జనాలను ప్రభుత్వం అదుపు చేయలేక పోతున్నదని ఆయన చెప్పారు.
 
అదేవిధంగా, పాపికొండలలో పర్యాటకుల తాకిడివల్ల గోదావరి కలుషితం కావటమే కాకుండా ప్రమాదాలు కూడా ఎక్కువవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులను లోబరుచుకుని వ్యాపార వర్గాలు అక్రమ మార్గాలు తొక్కుతున్నారని ఆయన విమర్సించారు. వీటిని కట్టడి చేసేది బదులు ఉన్న చట్టాలను సవరించాలని, అధికారంలో  ఉన్నవారు సలహాలు ఇవ్వటం బాధ్యతా రాహిత్యమైనదని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఇప్పటికే 1/70 చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని సుబ్బయ్య తెలిపారు. నూతన అటవీ చట్టం పేరున అడవుల నుంచి వనవాసులను అడవి బయటకు తరిమివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవీ ప్రాంతాల్లో గిరిజనులకు భూమిపై హక్కు పత్రాలు ఇచ్చే సమయం ఒపికా ఈ ప్రభుత్వాలకు ఉండటంలేదని ఆయన ఎద్దేవ చేశారు.
 
గ్రామ( పీసా) సభలను నిర్వహించకుండా గనుల తవ్వకాలకు గిరిజన ప్రాంతాల్లో అనుమతులను ఇస్తున్నారని ఆయన తెలిపారు. పర్యాటకం అభివృద్ధిపై ప్రేమ      ఉంటే గిరిజన ప్రాంతాలనే ఎందుకు ప్రభుత్వాలు ఎంచుకోవాలి? అని ఆయన ప్రశ్నించారు. భారత రాజ్యాంగ (5,6 షెడ్యూల్ ల)స్ఫూర్తికి అనుగుణంగా ప్రకటనలు, ఆచరణ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంకు  ఎస్సీ., ఎస్టీ.,హక్కుల సంక్షేమ వేదిక స్పష్టం చేసింది. ఈ విషయమై ప్రస్తుతం గిరిజనులలో తలెత్తిన సందేహాలను ప్రభుత్వం నివృతి చేయాలని సుబ్బయ్య కోరారు.