
అమెరికా నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులతో బయల్దేరిన విమానం బుధవారం అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. సీ-17 సైనిక విమానం మధ్యాహ్నం 1.55 గంటలకు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అమెరికా నుంచి వచ్చిన వారిలో 30 మంది పంజాబ్‌కు చెందిన వారు కాగా.. హరియాణా, గుజరాత్‌కు చెందిన వారు 33 మంది చొప్పున ఉన్నారు.
మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, చండీగఢ్ వాసులు ఇద్దరు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలుత, విమానంలో 205 మంది వస్తున్నట్లు వార్తలు రాగా కేవలం 104 మందే వచ్చారు. అమృత్‌సర్ చేరుకున్న వారిలో 25 మంది మహిళలు, 12 మంది మైనర్లు ఉన్నారని, వీరిలో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
48 మంది 25 ఏళ్లలోపు వారు ఉన్నట్లు సమాచారం. 11 మంది విమాన సిబ్బంది, వలసదారుల అప్పగింత కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 45 మంది అమెరికా అధికారులు కూడా విమానంలో వచ్చినట్లు తెలిసింది. అక్రమ వలసదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు.
అన్ని తనిఖీలు పూర్తి చేసిన తర్వాతే అక్రమ వలసదారులను వారి సొంత ప్రాంతాలకు పంపిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, అమెరికా నుంచి వెనక్కి పంపేసిన వలసదారులకు అండగా ఉండేందుకు పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ (నాపా) పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కాగా, అమెరికా అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. 17,940 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ఈఆర్‌వో) నిర్బంధంలో ఉన్నారు. తొలివిడతలో భాగంగా 104 మందిని వెనక్కి పంపించారు.
ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది. ఇప్పటికే కొంతమందిని సైనిక విమానాల్లో గ్వాటమాలా, పెరూ, హోండూరస్ తదితర దేశాలకు తరలించింది.
కాగా, అక్రమ వలసదారులంటూ భారతీయుల చేతులకు సంకెళ్లు వేసి విమానంలో తరలించడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి భారతీయులను అలా అవమానకరంగా విమానంలో తరలించిన ఫొటోలు చూసి, ఒక భారతీయుడిగా ఎంతో బాధపడ్డానని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం హెడ్ పవన్ ఖేరా చెప్పారు.
అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు భారతీయులవి కావని, నకిలీవని తేల్చారు. అవి జనవరి 30న అమెరికా నుంచి గ్వాటమాలాకు తరలించిన అక్రమ వలసదారుల ఫొటోలని ఫ్యాక్ట్‌చెక్‌లో తేల్చారు.
More Stories
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం
మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలో ఒకరు మృతి