రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,337 కోట్లు, ఏపీకి రూ.9,417 కోట్లు

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,337 కోట్లు, ఏపీకి రూ.9,417 కోట్లు
రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,337 కోట్లు, ఏపీకి రూ. 9,417 కోట్లు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.  అయితే గత యూపీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన గుర్తు చేశారు. ఏపీకి కూడా 11 రేట్లు ఎక్కువగా కేటాయించామని చెప్పారు.

తెలంగాణలో ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు మొత్తం రూ.41,677 కోట్లు అని చెప్పారు. అందులో కాజీపేట ప్రొడక్షన్ యూనిట్‌తోపాటు కొత్త రైల్వే ప్రాజెక్ట్స్ సైతం ఉన్నాయని వివరించారు. 1,326 కిలోమీటర్ల మేర కవచ్ ప్రాజెక్ట్ రానుందని.. ఇది 6 నుంచి 7 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ తరహ వ్యవస్థ జర్మనీ, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాల్లో అమలు చేయడానికి దాదాపు 20 ఏళ్లు పట్టిందని పేర్కొన్నారు. 

అలాగే నమో భారత్ రైళ్లు ( సమీప నగరాల మధ్య), అమృత్ భారత్ రైళ్లు (స్వల్ప ఖర్చుతో మెరుగైన సదుపాయాలు కలిగిన రైళ్లు) అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 100 శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. అలాగే తెలంగాణాలో రూ.41,677 కోట్ల పనులు జరుగుతున్నాయని వివరించారు. 

ఇక సికింద్రాబాద్ నుంచి కవచ్ వ్యవస్థ పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 1,300 కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థను ఏర్పటు చేశామన్నారు. రానున్న ఆరేళ్లలో కవచ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా 1000 కిలోమీటర్లు కేవలం రూ.450తో ప్రయాణించేలా నాన్ ఏసీ అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.

ఏపీ నుంచి తెలంగాణ, ఒడిశా, తమిళనాడుకు రైల్వే లైన్ల అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్న మంత్రి, అందుకే ఏపీ రైల్వే ప్రాజెక్టుల గురించి బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని చెప్పారు. రాష్ట్రం లోని 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని, ఈ స్టేసన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించామని తెలిపారు.

 ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబును కలిసి చర్చించామని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేగంగా ప్రాజెక్టుల పనులు చేపడుతున్నామని, వచ్చే నాలుగేళ్లలో రైల్వే లైన్ల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. 

ఏపీకి వందేభారత్‌ స్లీపర్ రైళ్లు కావాలని ప్రతిపాదనలు ఉన్నాయని నరేంద్ర ఎ.పాటిల్‌ చెప్పారు. విశాఖ- తిరుపతి మధ్య స్లీపర్ రైళ్లు ఎక్కువగా కావాలని, విజయవాడ రైల్వే స్టేషన్‌ను ఎన్‌ఎస్‌జీ-1 కేటగిరీలో చేర్చినట్లు వెల్లడించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి రూ.271 కోట్లు కేటాయించారని, విశాఖ-విజయవాడ లైనులో ఆటోమెటిక్ సిగ్నలింగ్‌ పూర్తి చేస్తున్నామని వివరించారు.