కుంభమేళాలో తొక్కిసలాటపై పిల్‌ తిరస్కరించిన `సుప్రీం’

కుంభమేళాలో తొక్కిసలాటపై పిల్‌ తిరస్కరించిన `సుప్రీం’

మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.

మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాటను నిరోధించడంలో యోగి సర్కార్‌ విఫలమైందంటూ న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశారు.

30 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అయితే, ఈ పిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇది దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది. ఈ ఘటనపై అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్‌ విశాల్‌ తివారీకి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా సూచించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు.