
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళ భక్తజన సంద్రమైంది. వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలిని సైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా వారిపై వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో నిరంజని అఖాడా అధిపతి కైలాశానంద గిరి మహరాజ్, అఖాడాలకు చెందిన ఇతర సాధవులు తమకు కేటాయించిన ఘాట్‌లలో పవిత్ర స్నానాలు చేశారు. వీరితోపాటు విదేశీయులు, సాధారణ భక్తులు లక్షల సంఖ్యల సంఖ్యలో తరలివస్తుండటంతో ప్రయాగ్‌రాజ్ మరోసారి భక్తజనసంద్రమైంది.
హరహర మహాదేవ్ నినాదాలతో ఘాట్‌లు మార్మోగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8 గంటల వరకు 62.25 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా, వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. మూడంచెల భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు ఘాట్ల వద్ద సింగల్ లైన్‌లో పంపిస్తున్నారు. అదేవిధంగా ప్రయాగ్‌రాజ్ లోపలికి కార్లను అనుమతించడం లేదు.
బయటి రాష్ట్రాలనుంచి వచ్చే భక్తుల కోసం 84 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 54 అతి జనసాంద్రత నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితిని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. అమృత స్నాన్‌కు ముందు జీరో-ఎర్రర్ ఈవెంట్‌ను నిర్వహించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు.
దీంతో ఉన్నతాధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి అవసరమైన సూచనలు చేస్తున్నారు. ఆయన అధికార నివాసంలో ప్రత్యేకంగా ఒక వార్‌రూమ్ ఏర్పాటు చేశారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 13 ముంచి ఇప్పటి వరకూ 33 కోట్ల 61 లక్షల మంది మహా కుంభ పవిత్ర స్నానాలు పూర్తి చేశారు.
సోమవారం అమృత్ స్నాన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ముగ్గురు సీనియర్ అధికారులు రంగంలోకి దిగారు. 2019లో అర్థ్ కుంభ మేళా ను సజావుగా, విజయవంతంగా నిర్వహించిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు అశిష్ గోయల్, భానుచంద్ర గోస్వామి ప్రస్తుతం మహా కుంభమేళాను పర్యవేక్షిస్తున్న అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తో కలిసి కీలక బాధ్యతలు పంచుకుంటున్నారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
నేపాల్ విద్యార్థిని ఆత్మహత్యతో ఒడిశా యూనివర్సిటీలో ఉద్రిక్తత