
పార్లమెంట్‌లో ఎన్‌ఆర్‌ఐలకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ మరోసారి వ్యక్తమయింది. మంగళవారం జరిగిన విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కొందరు సభ్యులు ఈ డిమాండ్ లేవనెత్తారు. ఇటీవల కాలంలో ఎన్‌ఆర్‌ఐల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రవాసీయుల సమస్యలు పెరిగాయని సభ్యులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ప్రవాస భారతీయులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. కాంగ్రెస్ ఎంపి దీపేందర్ సింగ్ హుడా మాట్లాడుతూ, విదేశాల్లో ఉంటున్న తన పౌరులకు పార్లమెంటులో ఇటలీ రిజర్వేషన్లు కల్పించిందని, అలాగే భారత్‌లోనూ కల్పించాలని కోరారు. ప్రవాస భారతీయుల సమస్యలను మెరుగైన రీతిలో పరిష్కరించడానికి పార్లమెంట్‌లో ఎన్‌ఆర్‌ఐలకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పారు.
పార్లమెంటరీ కమిటీ సమావేశం అనంతరం శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో పాల్గొన్న సంస్థలు కొన్ని విలువైన ప్రతిపాదనలు చేశాయని తెలిపారు. దేశీయ, విదేశీ అవసరాలను తీర్చగలిగే నైపుణ్యాన్ని భారత సంస్థలు కలిగి ఉన్నాయని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికుల ఇమ్మిగ్రేషన్‌ను క్రమబద్ధీకరించడానికి, చట్టవిరుద్ధంగా విదేశీ వలసలను అడ్డుకోవడానికి, ఇతర అవాంఛనీయ కార్యకలాపాలను అరికట్టడానికి పార్లమెంట్‌లో ఎన్‌ఆర్‌ఐలకు ప్రాతినిధ్యం ఉండాలని ఓ ఎంపీ వాదించినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు కేరళ నుంచి నార్కా రూట్స్, పంజాబ్ ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఆర్‌ఐల వ్యవహారాల విభాగం, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (పిఐఒసిసిఐ), సెంటర్ ఫర్ డిస్సోరా స్టడీస్, గుజరాత్ నుంచి సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ గుజరాత్ ప్రతినిధులు పాల్గొన్నారు.
వలసలు, ప్రవాస భారతీయుల సమస్యలపై దృష్టి సారించేందుకు ఉద్దేశించిన బిల్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలో జరిగిన సమావేశంలో ప్యానెల్‌కు తెలియచేసింది.
More Stories
ఖతార్ అధినేతకు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి మోదీ స్వాగతం!
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కుత్రిమ మేధ