మావోయిస్టు అగ్రనేత చలపతి ఈ నెల 20న ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆ ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి ఐదు రోజులుగా కొత్తకొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా ఆ ఎన్‌కౌంటర్‌తో ముడిపడిన మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా తన కదలికల విషయంలో అత్యంత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ఉండే చలపతి గతంలో చేసిన ఒక చిన్న పొరపాటే ఇప్పుడు ఆయన ప్రాణం పోవడానికి కారణమైనట్లు తెలిసింది. 2016 మే నెలలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల అనంతరం అక్కడ మావోయిస్టులకు చెందిన ఒక స్మార్ట్‌ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది.
పోలీసులు ఆ ఫోన్‌లోని సమాచారాన్ని జల్లెడపట్టారు. అందులో మావోయిస్టు అగ్రనేత చలపతి తన భార్య అణతో కలిసి దిగిన ఒక సెల్ఫీ కనిపించింది. దాంతో ప్రస్తుతం చలపతి రూపం ఎలా ఉంటుందనేది పోలీసులకు తెలిసిపోయింది. ఎప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు మావోయిస్టుల్లో చేరిన చలపతి ప్రస్తుత రూపురేఖలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడం అప్పటిదాకా పోలీసులకు సవాల్ ఉండేది.
అలాంటి సమయంలో పోలీసులు మొబైల్ దొరకడం బాగా ఉపయోగపడింది. ఆ సెల్ఫీనే రూ.1 కోటి రివార్డు కలిగిన చలపతిని పట్టుకునే దిశగా భద్రతా బలగాలను నడిపించింది. అయితే తన సెల్ఫీ పోలీసులకు దొరికిందని తెలిసినప్పటి నుంచి చలపతి అప్రమత్తమయ్యాడు. ఎక్కడికి వెళ్లినా తన వెంట పెద్ద సంఖ్యలో మావోయిస్టులను రక్షణగా తీసుకెళ్లేవాడు.ఈ క్రమంలోనే జనవరి 20 తెల్లవారుజామున మరో 13 మంది మావోయిస్టులతో కలిసి చలపతి వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆయనను, ఆయనతోపాటు ఉన్న మావోయిస్టులు అందరినీ మట్టుబెట్టాయి. సెల్ఫీలో ఉన్న ఫొటోతో మరణించిన మావోయిస్టుల్లోని ఒక వ్యక్తి ముఖం సరిపోలడంతో అతను చలపతిగా పోలీసులు నిర్ధారించుకున్నారు.
చలపతి అసలు పేరు రామచంద్రారెడ్డి. ఆయనది ఉమ్మడి చిత్తూరు జిల్లా. 2008 ఫిబ్రవరి 15న ఒడిశాలోని నయాఘర్ జిల్లాలో భద్రతా బలగాలపై జరిగిన దాడికి అతనే సూత్రధారి. ఆ దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి స్కెచ్ వేస్తే చలపతి వ్యూహాలు చాలా పకడ్బందీగా ఉండేవి.
నయాగఢ్ దాడికి ముందు కూడా మావోయిస్టులు అడవి లోపలికి వచ్చే అన్ని రోడ్లపై పెద్దపెద్ద చెట్లను, కర్ర దుంగలను అడ్డుగాపడేశారు. ఆ తర్వాత భద్రతా బలగాలపై దాడికి పాల్పడి, అక్కడి నుంచి పారిపోయారు. భద్రతా బలగాలు రోడ్లపై ఉన్న చెట్లు, కర్ర దుంగలను తొలగించుకుంటూ అడవుల్లోకి వెళ్లేసరికి చలపతి టీమ్ జారుకుంది. కాగా అప్పట్లో ఆ దాడి చేయాలని చలపతిని ఆదేశించింది మావోయిస్టు అగ్రనేత, దివంగత రామకృష్ణ అని తదుపరి పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
More Stories
ఖతార్ అధినేతకు స్వయంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి మోదీ స్వాగతం!
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్