పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు

పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు

హైదరాబాద్‌లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌  చైర్మన్‌ దిల్‌ రాజు  నివాసాలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆఫీసుతోపాటు మైత్రీ మూవీ మేకర్స్‌, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసిందే. 

తాజాగా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్‌ ఇంటితోపాటు ఆఫీసులో కూడా తనిఖీలు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు సుకుమార్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌, ఆదాయ వనరులు తదితర డాక్యుమెంట్లను పరిశీలించారు. పుష్ప 2కు సుకుమార్ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఇందుకు సంబంధించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్ చెల్లింపులపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.

నిర్మాతల ఇళ్లపై ఐటీ సోదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఫైనాన్సియర్స్‌ ఇళ్లపై, ఆఫీస్‌లపై సోదాలు జరగడంతో పాటు దర్శకుడు సుకుమార్‌ పైనా సోదాలు జరుగుతున్నాయి. సుకుమార్‌ పుష్ప 2 సినిమాకు గా ారీ పారితోషికంను అందుకోవడంతో పాటు, లాభాల్లో వాటాను దక్కించుకున్నారని, అందుకే నిర్మాతల ఆఫీస్‌లు, ఇళ్లతో పాటు సుకుమార్‌ ఇంట్లో, ఆఫీస్‌లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

పుష్ప 2 సినిమా రూ.1850 కోట్ల వసూళ్లు సాధించిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దాంతో అందుకు సంబంధించిన లెక్కలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. కాగా, పుష్ప 2′ నిర్మాణంలో సుకుమార్ నిర్మాణ సంస్థ ‘సుకుమార్ రైటింగ్స్’.. మైత్రీ మూవీ మేకర్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఐటీ అధికారులు ఇప్పటికే మంగళవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఐటీ అధికారులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ , మైత్రీ మూవీ మేకర్స్‌, మ్యాంగో మీడియా సంస్థలు ఆయా సినిమాలకు పెట్టిన పెట్టుబడులు, ఆదాయాలపై ఆరాతీసినట్టు తెలుస్తోంది.  దిల్ రాజు ఇటీవల గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలను నిర్మించారు. వాటికి సంబంధించిన పెట్టుబడి, రాబడి లెక్కలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

దిల్ రాజు భార్యను వెంట పెట్టుకుని బ్యాంక్‌కి వెళ్లి అక్కడి లాకర్స్‌ను ఓపెన్‌ చేయించారు. తాజాగా దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆమె సమక్షంలోనే డిజిటల్ లాకర్లు ఓపెన్ చేయించారు. మరికొద్దిసేపట్లో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించనున్నారు ఐటీ అధికారులు.

మరో పక్కా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థకు సంబంధించి రవిశంకర్, నవీన్‌, సీఈఓ చెర్రీ ఇళ్లు, కార్యాలయాలు, వారి భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సింగర్‌ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వీళ్ళే కాకుండా అభిషేక్ పిక్చర్స్ అధినేత, నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత కిషోర్ తదితరులు ఇంట్లో సోదాలు జరిగినట్లు సమాచారం.