
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజితో ఇక ప్రైవేటీకరణ సమస్య ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్ కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ.11,404 కోట్ల ప్యాకేజిపై ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలు జయప్రదమయ్యాయని తెలిపారు.
స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం భారీ ప్యాకేజీకి ప్రకటించడంతో ప్రధాని మోదీ, నిర్మలా సీతారామాన్, కుమారస్వామిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో పట్టుదలతో కష్టపడి రూ.11,440 కోట్లు సాధించామన్నారు. విశాఖ ఉక్కును బలమైన సంస్థగా ముందుకు తీసుకెళ్లేందుకు కలసికట్టుగా కృషి చేస్తామని వెల్లడించారు.
సమిష్టి కృషితోనే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజి ప్రకటించిందని చెప్పారు. ‘ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి’ అని పేర్కొన్నారు. ఇప్పటి వరక’విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఉద్యమించామని, ఇప్పుడు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల సెంటిమెంట్’ అనే నినాదంతో పనిచేయాలని చెప్పారు.
యాజమాన్యం సరిగా లేకుండా కార్మికులు, ఉద్యోగులు మాత్రమే పనిచేసినా ఫలితం ఉండదని, అందువల్ల సమర్ధవంతమైన యాజమాన్యాన్ని నియమించి, సక్రమ నిర్వహణ చేయాల్సిఉందని చెప్పారు.. బలహీనపడుతున్న ప్లాంట్‌కు కేంద్రం సహాయం చేసిందని, దీనిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో పాటు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం, ఉద్యోగులు బాధ్యతతో ప్రవర్తించాలని ఆయన చెప్పారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. ప్లాంట్ బలహీనపడుతుందనే కారణంతో తాము ఇలానే నిర్వహణ చేస్తామంటే కుదరదని, ప్యాకేజ్ ఇచ్చారనే ధీమాతో ఇష్టం ప్రకారం చేస్తామన్నా కుదరదని హెచ్చరించారు.
ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అని, దీనిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. ప్లాంట్‌కు సరైన సిఇఓను నియమించి సమర్ధవంతంగా పనిచేయించాలని ఆయన కోరారు. స్టీల్‌ప్లాంట్ దెబ్బతిన్నట్లయితే చాలా సమస్యలు వస్తాయని, దీనిని కాపాడుకుంటూనే మరో పక్క 20లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్లాంట్ ఇబ్బందుల్లో ఉందనే కారణంతో నెలకయ్యే రూ.80కోట్ల విద్యుత్ బిల్లు, నీటి బిల్లులను కూడా రాష్ట్రప్రభుత్వం నాలుగు నెలల నుంచి వసూలు చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పారు.
కాగా, స్టీల్‌ప్లాంటుకు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించడం చాలా సంతోషం అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఉక్కు పరిశ్రమను నిలబెట్టాలన్న ప్రధాని నిబద్ధతకు ఇదే నిదర్శనమని కొనియాడారు. ప్యాకేజీ కేవలం సంఖ్య కాదు వేల కుటుంబాల్లో ఆశలు రేకెత్తించిందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కల సాకార క్రమంలో స్టీల్ ప్లాంటు ఒకటని చెప్పారు. ఏపీ అభివృద్ధి పట్ల మోదీ నిబద్ధతకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!