సైఫ్‌ అలీ ఖాన్​పై దాడిలో అండర్‌వరల్డ్‌ హస్తం లేదు!

సైఫ్‌ అలీ ఖాన్​పై దాడిలో అండర్‌వరల్డ్‌ హస్తం లేదు!

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి వెనుక అండర్​వరల్డ్ హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా సైఫ్‌ ఇంట్లో పనిచేసిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 30 బృందాలు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి.

ఇటీవల సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ నటులకు హత్య బెదిరింపులు రావడంతో, ఈ కత్తిపోటు కేసు ముంబై అండర్ వరల్డ్ హస్తం ఇందులో ఉండవచ్చనే ఊహాగానాలకు దారితీసింది. ముంబయిలో పలువురు ఇన్ఫార్మర్ల సాయంతో నిందితుడికి సంబంధించి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సైఫ్‌పై దాడి జరిగినపుడు సమీపంలో క్రీయాశీలంగా ఉన్న అన్ని మెుబైల్ ఫోన్ల సాంకేతిక డేటాను సేకరించారు.

అయిత, సైఫ్‌ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేశ్‌ కదమ్‌ స్పష్టం చేశారు. దీనిలో క్రిమినల్‌ గ్యాంగ్‌లు, అండర్​వరల్డ్​ ప్రమేయం ఉందన్న కథనాలను ఆయన తోసిపుచ్చారు. అటువంటి కోణం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని మంత్రి పేర్కొన్నారు. కేవలం చోరీ కోసమే నిందితుడు వచ్చినట్లు ఇప్పటివరకు తెలిసిందని చెప్పారు. 

ఏదైనా బెదిరింపు వచ్చినట్లు సైఫ్‌ నుంచి పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని, సెక్యూరిటీని కూడా కోరలేదని చెప్పారు. ఒకవేళ భద్రతను కోరితే నిబంధనల ప్రకారం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.

మరోవంక, సైఫ్ అలీఖాన్‌ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆయనకు చికిత్స చేస్తున్న ముంబయి లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నిందితుడి దాడిలో సైఫ్‌ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వైద్యులు తెలిపారు. దాడిలో కత్తి సైఫ్‌ వెన్నుముకకు రెండు మిల్లీమీటర్ల దూరంలో ఆగిందని చెప్పారు. లేదంటే ఆయన వెన్నుముకకు తీవ్రగాయం అయ్యేదని వెల్లడించారు. 

ప్రస్తుతం సైఫ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. సైఫ్‌ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చినట్టు తెలిపిన వైద్యులు సైఫ్‌ చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్‌ సర్జరీ చేసినట్టు వివరించారు. సైఫ్‌ వెన్నులో చిక్కుకున్న కత్తిని తొలగించినట్టు తెలిపారు. సైఫ్‌ ప్రస్తుతం సాధారణ ఆహారం తీసుకుంటున్నాని తెలిపిన వైద్యులు ప్రస్తుతం అందరితో మాట్లాడుతున్నారని, నడుస్తున్నారని స్పష్టం చేశారు. 

మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సైఫ్​ను చూడడానికి అతని కుమార్తె సారా అలీఖాన్​ ఆసుపత్రికి వెళ్లారు.నిందితుడు బాంద్రా స్టేషన్ నుండి లోకల్ లేదా ఎక్స్ ప్రెస్ రైలులో ముంబై దాటి ఉండవచ్చని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు విచారిస్తున్నారు. సైఫ్‌ ఇంట్లో పనిచేస్తున్న వారిని పోలీసులు ఇవాళ బాంద్రా పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి ప్రశ్నించారు. సైఫ్‌ ఇంట్లో పనిచేసిన కార్పెంటర్‌ను పోలీసులు ప్రశ్నిచారు. ఆయన ఇంట్లో పనిచేసిన అందరినీ ోలీసులు విచారిస్తున్నారి, అందులో భాగంగానే తన భర్తు కూడా పిలిచారని కార్పెంటర్‌ భార్య చెప్పారు. 

మరోవైపు నిందితుడికి సంబంధించిన సీసీటీవీ కొత్త దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అందులో నిందితుడు బ్యాగ్‌తో మెట్లు ఎక్కుతున్నాడు. గురువారం తెల్లవారుజాము అర్ధరాత్రి ఒంటిగంట 37 నిమిషాలకు మెట్ల మార్గం ద్వారా నిందితుడి లోపలికి వెళుతున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఆ సమయంలో నిందితుడు ముఖానికి ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టుకున్నాడు.