విదేశీ కరెన్సీలో చెల్లింపులపై కేటీఆర్ పై ఈడీ ప్రశ్నలు

విదేశీ కరెన్సీలో చెల్లింపులపై కేటీఆర్ పై ఈడీ ప్రశ్నలు
‘విదేశీ సంస్థ అయిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో)కు రూ.45.71 కోట్లకు సమానమైన మొత్తాన్ని విదేశీ కరెన్సీలో ఎందుకు చెల్లించారు? రిజర్వ్‌బ్యాంకు అనుమతి తీసుకున్నారా? విదేశీ కరెన్సీ నిధుల చెల్లింపులో పాటించాల్సిన నిబంధనలను మీరు ఎందుకు అనుసరించలేదు?’ అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
‘నాడు పురపాలకశాఖ మంత్రి హోదాలో మీరు చెబితేనే హెచ్‌ఏండీఏ నుంచి ఎఫ్‌ఈఓకు డబ్బు విడుదల చేశామని అధికారులంటున్నారు. మరీ మీరు ఆ విధమైన ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఫార్ములా-ఈ రేసు కేసుకు సంబంధించి కేటీఆర్‌ను ఈడీ అధికారులు గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు, దాదాపు ఏడున్నర గంటలు విచారించారు. 
 
మధ్యలో కొద్దిసేపు విరామం ఇచ్చారు. ఈడీలోని జాయింట్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో విచారణ కొనసాగింది. ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో కేటీఆర్‌ను ప్రశ్నించారని, దాదాపు 40 ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. ‘2022 అక్టోబరు 25న జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ప్రమోటర్‌ కంపెనీ అయిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌.. అన్ని సీజన్లకు ఫీజు చెల్లించాల్సి ఉండగా, మీరెందుకు 2023లో కొత్త ఆదేశాలు ఇచ్చారు? హెచ్‌ఎండీఏ జనరల్‌ నిధుల నుంచి రెండు ఇన్వాయి్‌సలకు సంబంధించిన మొత్తాన్ని క్లియర్‌ చేస్తూ ప్రొసీడింగ్‌ ఇచ్చిన నాటి చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి.. మీ ఆదేశాలనే అమలు చేశానని చెప్పారు కదా?’ అని ఈడీ అధికారులు ప్రశ్నించగా.. అదంతా అధికారులే చూసుకున్నారని కేటీఆర్‌ చెప్పినట్లు సమాచారం. 

నాటి లావాదేవీలకు సంబంధించిన సొమ్ము ఎక్కడికీ పోలేదని, ఎఫ్‌ఈఓ వద్ద భద్రంగా ఉందని.. ప్రభుత్వం ఆ సొమ్ము తీసుకోకుండా, కక్షసాధింపు కోసమే కేసు పెట్టిందని కేటీఆర్‌ పేర్కొన్నట్లు తెలిసింది. ఇది తప్పుడు కేసు, ఇందులో పైసా అవినీతి జరగలేదని కేటీఆర్‌ పలుమార్లు అన్నప్పుడు అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు ఇవ్వండని ఓ దశలో ఈడీ అధికారులు అన్నట్టు సమాచారం.

పురపాలక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఏండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్‌ను ఈడీ అఽధికారులు ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. నిధుల బదిలీకి సంబంధించి మంత్రి హోదాలో కేటీఆర్‌ ఇచ్చిన ఉత్తర్వులను చూపించి మరీ ప్రశ్నించినట్లు తెలిసింది.

ఈడీ విచారణకు హజరైన కేటీఆర్‌ అక్కడి అధికారులకు రెండు డాక్యుమెంట్లను ఇచ్చి రసీదు తీసుకున్నట్లు సమాచారం. ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి నీల్సన్‌ సంస్థ రూపొందించిన నివేదికతోపాటు తెలంగాణ ఈవీ పాలసీ-2020కి సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు కేటీఆర్‌ అందజేసినట్లు తెలిసింది. కాగా, వ్యక్తిగత బ్యాంకు ఖాతా, ఆస్తుల వివరాలను ఈడీ అధికారులు అడగ్గా, త్వరలోనే వాటిని ఇస్తానని కేటీఆర్‌ చెప్పారని సమాచారం.