బెనిఫిట్‌షోలు లేవంటూనే ప్రత్యేక షోలకు అనుమతులా?

బెనిఫిట్‌షోలు లేవంటూనే ప్రత్యేక షోలకు అనుమతులా?

గేమ్ ఛేంజర్ టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ జరుపుతూ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, ప్రత్యేక షోలకు అనుమతులేంటి? అని ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునః సమీక్షించాలన్న హైకోర్టు, ఈ మేరకు హోంశాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాను ఆదేశించింది. 

భారీ బడ్జెట్‌తో తీసి నిర్మాతలు ప్రేక్షకుల నుంచి డబ్బును వసూలు చేయాలనుకోవడం సరికాదని హితువు పలికింది. సినిమాటోగ్రఫి చట్టాన్ని ఉల్లంఘిస్తూ టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు హోంశాఖ అనమతి ఇస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. 2021లో జారీ అయిన జీఓ ప్రకారమే టికెట్ల ధరలు ఉండాలి, కానీ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమో ఆధారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. పెంచిన టికెట్ ధరలు ఈ నెల 19వ తేదీ వరకే ఉంటాయని హోంశాఖ జిపి కోర్టుకు చెప్పారు. 

ఇటీవల పుష్ప-2 చిత్రానికీ సైతం టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారని, బెనిఫిట్ షో వల్ల చోటు చేసుకున్న ప్రమాదాన్ని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు గుర్తుచేశారు. బెనిఫిట్ షోలను అనుమతించేది లేదని ప్రభుత్వం ప్రకటించినా, స్పెషల్ షోలకు మాత్రం ఉత్తర్వులిస్తున్నారని వాదనలు వినిపించారు. స్పెషల్ షోలకు ఉత్తర్వులివ్వడం బెనిఫిట్ షో లాంటిదేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

అర్ధరాత్రి వేళ షోలకు అనుమతిస్తే ఇంటికి వచ్చే సరికి ఎంత సమయం అవుతుందని హైకోర్టు జిపిని ఘాటుగా ప్రశ్నించింది. అభివృద్ధి అంటే అర్ధరాత్రి తర్వాత బయట తిరగడం కాదని, సమయానికి నిద్రపోవడం కూడా ముఖ్యమే కదా! అని హైకోర్టు పేర్కొంది. ప్రేక్షకుల భద్రతనూ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. గొర్ల భరత్ రాజ్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. జనవరి 10వ తేదీన ఉదయం 4.30 గంటలకు సినిమా ప్రదర్శనకు అనుమతివ్వడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

టికెట్ ధరల పెంపు కూడా నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ పెంపుపై ఉత్తర్వులివ్వకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. హైకోర్టు స్పందిస్తూ తరచూ ఇలాంటి మెమోలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించింది.