మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు బీజేపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌

మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు బీజేపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌
 
తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల‌ను అందరికంటే ముందుగా బీజేపీ ప్ర‌క‌టించింది. రెండు టీచ‌ర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్య‌ర్థుల‌ను పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించడంతో ఎమ్మెల్సీ ఎన్నికలపైనా ప్రస్తుతం ద్రుష్టి సారిస్తున్నది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఈ మూడు స్థానాలను సైతం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది.

న‌ల్ల‌గొండ – వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్య‌ర్థిగా పులి స‌రోత్త‌మ్ రెడ్డి: క‌రీంన‌గ‌ర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెద‌క్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్య‌ర్థిగా మ‌ల్కా కొమర‌య్య‌: క‌రీంన‌గ‌ర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెద‌క్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా సి అంజిరెడ్డిని ఎంపిక చేసిన‌ట్టు కిష‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు.

స‌రోత్త‌మ్ రెడ్డి

స‌రోత్త‌మ్ రెడ్డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన వ్య‌క్తి. ప్ర‌ధానోపాధ్యాయుడిగా 10 ఏండ్లు, స్కూల్ అసిస్టెంట్ టీచ‌ర్‌గా 21 ఏండ్లు ప‌ని చేశారు. 2012 నుంచి 2019 దాకా పీఆర్టీయూ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా సేవ‌లందించారు. తెలంగాణ ఉద్య‌మంలో చురుకుగా పాల్గొన్నారు. టీచ‌ర్ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త‌న వంతు కృషి చేశారు స‌రోత్త‌మ్ రెడ్డి.

మ‌ల్క కొమ‌ర‌య్య‌

పెద్ద‌ప‌ల్లికి చెందిన మ‌ల్క కొమ‌ర‌య్య‌ ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి బీఈ పట్టా పుచ్చుకున్నారు. పెద్ద‌ప‌ల్లి, నిర్మ‌ల్, హైద‌రాబాద్‌లో అనేక విద్యా సంస్థ‌ల‌ను నెల‌కొల్పారు. పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు గణనీయ కృషి చేస్తున్నారు. ప‌ల్ల‌వి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌కు చైర్మ‌న్‌గా సేవ‌లందిస్తున్నారు.

అంజిరెడ్డి

మెద‌క్ జిల్లాలోని రామ‌చంద్రాపురానికి చెందిన సీ అంజిరెడ్డి బీఏ పూర్తి చేశారు. పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగారు. అంజిరెడ్డి భార్య గోదావ‌రి.. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలిగా కొనసాగుతున్నారు. గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి ఎస్ఆర్ ట్ర‌స్ట్‌ను అంజిరెడ్డి నిర్వ‌హిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సుర‌క్షిత తాగునీటిని అందించేందుకు ఎస్ఆర్ ట్ర‌స్ట్ తోడ్పాటును అందిస్తుంది. అంతేకాకుండా పేద విద్యార్థుల‌కు విద్యా, ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది.